Recharge Price Hike: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరుగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
సామాన్యులకు మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. టెలికాం రంగంలో రెండేళ్ల విరామం తర్వాత, మొబైల్ టారిఫ్‌లను సుమారు 15 శాతం పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నట్లు విశ్లేషకులు వెల్లడించారు. జెఫ్రీస్ నివేదిక ప్రకారం, ఈ ధరల పెంపు 2026 జూన్‌లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన ధరల సవరణల ట్రెండ్‌ను అనుసరిస్తూ, డేటా వినియోగం వేగంగా పెరగడం, ప్రీపెయిడ్ వినియోగదారులు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వైపు మారడం వలన ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం కూడా స్థిరంగా పెరుగుతున్నందున, టెలికాం కంపెనీలకు ఇది ఆదాయ వృద్ధికి బలమైన మద్దతుగా పనిచేస్తుందని నివేదిక సూచిస్తోంది.
Details
టెలికాం రంగ ఆదాయం సుమారు 16 శాతం పెంపు
2026లో రీచార్జ్ ధరల పెంపు జరిగితే, 2027 ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగ ఆదాయం సుమారు 16 శాతం పెరుగుతుందని అంచనా. ఇది 2026లో 7 శాతం వృద్ధితో పోలిస్తే దాదాపు రెండింతలతో సమానం. టారిఫ్‌లు 15 శాతం పెరిగితే, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం సగటున 14 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ధరల పెంపు కారణంగా కొత్త వినియోగదారుల చేరిక కొంత మందగించే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. కంపెనీ వారీగా ప్రభావం భిన్నంగా ఉంటుంది. రిలయన్స్ జియో 10-20శాతం వరకు సేవల ధరలు పెంచే అవకాశం ఉందని అంచనా. దీని ద్వారా భారతి ఎయిర్‌టెల్‌తో సమానంగా విలువను నిలబెట్టుకోవడం, పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందించడం లక్ష్యంగా ఉంది.
Details
మరింత అధ్వాన్నంగా వొడాఫోన్, ఐడియా పరిస్థితి
మరోవైపు, అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా పరిస్థితి మరింత కఠినంగా ఉంది. భారీ ప్రభుత్వ బకాయిలను తీర్చేందుకు 2027-2030 మధ్యలో మొత్తం సుమారు 45 శాతం వరకు సేవల ధరలు పెంచాల్సి రావచ్చు. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాకు సంబంధించిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలు ప్రభుత్వ పర్యవేక్షణలో నిలిపివేయబడ్డాయి. ఈ బకాయిలు 2032 నుంచి చెల్లించడం ప్రారంభమై 2041 వరకు కొనసాగతాయి. ఐదేళ్ల మోరాటోరియం ఉన్నా, నెట్‌వర్క్ పెట్టుబడులను కొనసాగించేందుకు కంపెనీకి ఇంకా భారీగా నిధులు అవసరం. 5జీ నెట్‌వర్క్ నిర్మాణం ప్రధాన దశ పూర్తవడంతో, టెలికాం కంపెనీల ఖర్చులు తగ్గే అవకాశముంది, తద్వారా లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.