LOADING...
Blinkit delivery fee: వినియోగదారులను నిలుపుకునేందుకు డెలివరీ ఫీజు తొలగించిన బ్లింకిట్
వినియోగదారులను నిలుపుకునేందుకు డెలివరీ ఫీజు తొలగించిన బ్లింకిట్

Blinkit delivery fee: వినియోగదారులను నిలుపుకునేందుకు డెలివరీ ఫీజు తొలగించిన బ్లింకిట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్విక్‌ కామర్స్‌ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి దిగ్గజ సంస్థల నుంచి స్టార్టప్‌ కంపెనీలకు తీవ్ర సవాల్‌ ఎదురవుతోంది. ఈ రెండు ఈ-కామర్స్‌ దిగ్గజాలు వేగంగా క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టడంతో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌లీడర్‌గా ఉన్న బ్లింకిట్‌ గురుగ్రామ్‌, బెంగళూరు, ముంబయి వంటి ఎంపిక చేసిన మార్కెట్లలో డెలివరీ ఫీజును పూర్తిగా తొలగించింది. ఇప్పటికే బలంగా పాతుకుపోయిన మార్కెట్లలో కొత్తగా వచ్చే ప్లేయర్లకు గట్టి సవాల్‌ విసరాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, క్విక్‌ కామర్స్‌ విభాగంలో జెప్టో, స్విగ్గీ ఇప్పటికే కనీస కార్ట్‌ విలువతో పాటు వివిధ రకాల ఫీజులను తొలగించాయి.

Details

ఖాతాదారులను నిలుపుకునేందుకు ప్రయత్నాలు

జెప్టో గతేడాది హ్యాండ్లింగ్‌ ఫీజు, సర్‌ఛార్జ్‌ వంటి ఛార్జీలను తొలగించడంతో పాటు కనీస ఆర్డర్‌ విలువను రూ.99గా నిర్ణయించింది. ఆ మొత్తాన్ని మించిన ఆర్డర్లకు ఉచిత డెలివరీ అందిస్తోంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ కూడా ఇదే దారిలో పయనిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ ఫీజుల విషయంలో బ్లింకిట్‌ వెనక్కి తగ్గలేదు. కానీ ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌, అమెజాన్‌ నౌ పేర్లతో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సంస్థలు క్విక్‌ కామర్స్‌ రేసులోకి ప్రవేశించడంతో బ్లింకిట్‌ వ్యూహం మార్చుకుంది. ఈ కొత్త పోటీని తట్టుకునేందుకు డెలివరీ ఫీజును తొలగించి ఖాతాదారులను నిలుపుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. మరోవైపు అమెజాన్‌ సగటున రెండు డార్క్‌ స్టోర్ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ప్రకటించగా, ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ విభాగంలో దూకుడుగా విస్తరిస్తోంది.

Advertisement