Loading...
Crude Oil Price: మళ్లీ భగ్గుమన్న క్రూడాయిల్.. జులై 24 తర్వాత తొలిసారి 100 డాలర్లకు
మళ్లీ భగ్గుమన్న క్రూడాయిల్.. జులై 24 తర్వాత తొలిసారి 100 డాలర్లకు

Crude Oil Price: మళ్లీ భగ్గుమన్న క్రూడాయిల్.. జులై 24 తర్వాత తొలిసారి 100 డాలర్లకు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమెరికా, ఇరాన్ దాడుల్లో కలిపి 10కిపైగా చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చన్న భయాలు పెరిగాయి. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. గత కొన్ని సెషన్లుగా క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర మరోసారి బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని తాకింది. చాలా రోజుల తర్వాత ఈ స్థాయికి చేరడం గమనార్హం.

వివరాలు 

జులై 24న చివరిసారి 100 డాలర్ల వద్ద..

బ్రెంట్ క్రూడ్ చివరిసారిగా జులై 24న బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిలో ట్రేడయింది.

ఆ తర్వాత దాదాపు 45 రోజుల వ్యవధిలో మళ్లీ అదే స్థాయికి చేరింది. బుధవారం ఒక్కరోజే బ్రెంట్ క్రూడ్ ధర 2 శాతానికిపైగా పెరిగింది.

మరోవైపు అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) క్రూడ్ ధర కూడా దాదాపు 2 శాతం పెరిగి 95 డాలర్లకు చేరువైంది.

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు దాదాపు ఆరు నెలలు కావస్తున్నా.. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే పరిస్థితులు కనిపించడం లేదు.

దీనికి తోడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో చమురు మార్కెట్లలో ఆందోళన కొనసాగుతోంది.

వివరాలు 

ఫిబ్రవరి 28 నుండి ఉద్రిక్తతలు..

అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలు ఫిబ్రవరి 28న మొదలయ్యాయి.

అప్పటి నుంచి పరిస్థితి క్రమంగా తీవ్రరూపం దాల్చింది. ఒక దశలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతో అంతర్జాతీయ చమురు సరఫరాకు భారీగా అంతరాయం ఏర్పడింది.

దీని ప్రభావం పలు దేశాలపై తీవ్రంగా పడింది. ఇంధనం, గ్యాస్ కొరత ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అదే సమయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగాయి.

చమురు ధరల్లో చోటుచేసుకునే ఇలాంటి భారీ మార్పులు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు స్టాక్ మార్కెట్లపైనా ఒత్తిడిని పెంచుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

భారత మార్కెట్లపైనా చమురు సెగ..

క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో భారత స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.

సోమవారం నుంచి వరుసగా మూడో సెషన్‌లో బుధవారం కూడా దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి.

సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సెన్సెక్స్ సుమారు 450 పాయింట్లు నష్టపోయి 75,120 స్థాయిలో కొనసాగింది.

నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు దిగజారింది. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ నష్టం 600 పాయింట్లను కూడా దాటింది. ముఖ్యంగా ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు కనిపించాయి.

ADVERTISEMENT

వివరాలు 

చమురు ధరలు 120 డాలర్లకు చేరొచ్చన్న హెచ్చరిక

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ హెచ్చరించింది.

ఈ అంచనా అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ఆందోళనకు కారణమైంది.

అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు ఎప్పుడు ముగుస్తాయో, హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో స్పష్టత లేకపోవడంతో.. చమురు సరఫరాపై అనిశ్చితి కొనసాగుతోంది.

ఈ ఉద్రిక్తతలు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయన్నదే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్న ప్రధాన అంశంగా మారింది.

ADVERTISEMENT