Loading...
Crude Oil Prices: ట్రంప్ ఓటమి ప్రభావం.. భారీగా తగ్గిన ముడి చమురు ధరలు
ట్రంప్ ఓటమి ప్రభావం.. భారీగా తగ్గిన ముడి చమురు ధరలు

Crude Oil Prices: ట్రంప్ ఓటమి ప్రభావం.. భారీగా తగ్గిన ముడి చమురు ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ డెమోక్రాట్లు మెజారిటీ సాధించడంతో మార్కెట్లలో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. గత శుక్రవారం బ్యారెల్‌కు 118 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడాయిల్ ధర ప్రస్తుతం 94 డాలర్ల దిగువకు చేరింది. ఈ క్రమంలో ధరలు 20 శాతానికిపైగా తగ్గడం గమనార్హం. బుధవారం రాత్రి ఒక్కసారిగా 10 శాతం పతనమైన క్రూడాయిల్ ధరలు.. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనూ తగ్గుదల కొనసాగించాయి. ఒక దశలో బ్యారెల్ ధర 93.46 డాలర్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

వివరాలు 

ఇరాన్ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలికే అవకాశం

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం ఇరాన్‌తో అమెరికా సంబంధాలపై ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇరాన్‌పై సైనిక చర్యలకు ట్రంప్ ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం కష్టమవుతుందని భావిస్తున్నారు.

దీంతో ఇరాన్ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలికే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి.

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే ఆశలు కూడా చమురు మార్కెట్లో కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు చమురు సరఫరాలో అంతరాయాలు తొలగిపోవడానికి దోహదపడతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఈ అంచనాలే క్రూడాయిల్ ధరల పతనానికి ప్రధాన కారణంగా మారాయి.

వివరాలు 

యుద్ధాన్ని ముగించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వం

ఎన్నికలకు ముందే ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ ఒక ఒప్పందాన్ని కోరుకుంటోందని,తాము కూడా అందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

తాజాగా ఎన్నికల్లో ఎదురైన ఓటమి నేపథ్యంలో సైనిక చర్యల కంటే దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికే ట్రంప్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యుద్ధాన్ని ముగించేందుకు ఖతార్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తోంది.

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, చమురు సరఫరా పెరగడం కూడా ధరల తగ్గుదలకు కారణమైంది.

సౌదీ అరేబియా,యూఏఈ,కువైట్,ఇరాక్ దేశాల నుంచి ముడి చమురు ఎగుమతులు అక్టోబరులో 10 శాతం పెరిగాయి.

దీంతో రోజువారీ ఎగుమతులు 15.53 మిలియన్ బ్యారెళ్లకు చేరాయి.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ

ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మధ్యంతర ఎన్నికల ఫలితాలు అమెరికా స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ),సెమీకండక్టర్, డేటా సెంటర్లకు సంబంధించిన షేర్లు పతనమైనప్పటికీ.. సంప్రదాయ ఐటీ,టెక్నాలజీతో పాటు ఇతర రంగాల షేర్లు లాభపడ్డాయి.

దీంతో ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 119.81 పాయింట్లు (1.58 శాతం) పెరిగి 7,688.73 వద్ద స్థిరపడింది.

నాస్‌డాక్ కాంపోజిట్ 366.26 పాయింట్లు (1.44 శాతం) లాభపడి 25,736.51 పాయింట్లకు చేరింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఏకంగా 1,575.38 పాయింట్లు (3.04 శాతం)పెరిగి 53,362.57 వద్ద ట్రేడింగ్ ముగించింది.

ADVERTISEMENT