BSNL-Vi: బీఎస్‌ఎన్‌ఎల్, వోడాఫోన్ కీలక ఒప్పందం.. ఇక నెట్‌వర్క్ సమస్యలకు చెక్!
ఈ వార్తాకథనం ఏంటి
టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ప్రైవేట్ టెలికాం దిగ్గజం Vodafone Idea (Vi) కీలక భాగస్వామ్యం చేసుకున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన 'నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం' (ICR - Intra Circle Roaming)తో నెట్‌వర్క్ కవరేజ్ మరింత బలోపేతం కానుంది. ఈ భాగస్వామ్యంతో యూజర్లకు మెరుగైన కవరేజ్ అందడంతో పాటు BSNL 5G సేవల రాకకు కూడా మార్గం సుగమం కానుందా అనే చర్చ మొదలైంది.
వివరాలు
ఒప్పందంలో కీలక అంశాలు
మెరుగైన నెట్‌వర్క్ కవరేజ్
ఈ ఒప్పందంలో భాగంగా BSNL, Vi సంస్థలు పరస్పరం తమ టవర్లు, నెట్‌వర్క్ మౌలిక వసతులను పంచుకోనున్నాయి.
దీంతో Vi టవర్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో BSNL యూజర్లకు మెరుగైన సిగ్నల్ లభించే అవకాశం ఉంటుంది.
అదే విధంగా BSNL నెట్‌వర్క్ బలంగా ఉన్న ప్రాంతాల్లో Vi వినియోగదారులకు కూడా మెరుగైన సిగ్నల్ అందుతుంది.
వివరాలు
సిగ్నల్ కవరేజ్ సమస్యలకు పరిష్కారం
గ్రామీణ ప్రాంతాలు, సరిహద్దు పరిసరాల్లో BSNL కవరేజ్ బలంగా ఉండగా.. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో Vi నెట్‌వర్క్ మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రెండు సంస్థలు తమ నెట్‌వర్క్ వనరులను పరస్పరం పంచుకోవడం ద్వారా కవరేజ్ సమస్యలను తగ్గించుకునే అవకాశం ఉంది.
ఫలితంగా రెండు కంపెనీల వినియోగదారులకు నెట్‌వర్క్ లోపాలు లేకుండా మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది.
వివరాలు
కస్టమర్లకు ప్రయోజనం
ముఖ్యంగా రీఛార్జ్ ధరలు పెరిగిన తర్వాత BSNL వైపు మొగ్గు చూపిన వినియోగదారులకు ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారనుంది.
BSNL సేవలు ఉపయోగిస్తున్న సమయంలో ఎదురవుతున్న ఇండోర్ కవరేజ్, డేటా స్పీడ్ సమస్యలకు ఈ నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం కొంత ఊరట కలిగించనుంది.
వివరాలు
BSNL 5G రాబోతోందా?
BSNL, Vi మధ్య కుదిరిన ఈ నెట్‌వర్క్ షేరింగ్ డీల్‌తో BSNL 5G సేవలు మరింత వేగవంతం కానున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం BSNL దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది.
ఈ 4G టవర్లను భవిష్యత్తులో 5Gకి అప్‌గ్రేడ్ చేసే విధంగా స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు Vi ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 5G ట్రయల్స్, విస్తరణపై దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో రెండు సంస్థల మధ్య ఏర్పడిన భాగస్వామ్యం BSNLకు కూడా తన యూజర్లకు 5G అనుభవాన్ని అందించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.