బైజూస్ CFO అజయ్ గోయెల్ 7నెలలకు రాజీనామా.. వేదాంతలో తిరిగి చేరిక
బైజూస్ సీఎఫ్ఓ అజయ్ గోయెల్ రాజీనామా చేశారు. గత ఏప్రిల్‌లో బైజూస్‌లో CFO (Chief Financial Officer)) బాధ్యతను స్వీకరించిన అజయ్ గోయెల్, కేవలం ఏడు నెలలకే ప్రఖ్యాత ఎడ్ టెక్ సంస్థకు గుడ్ బై చెప్పేశారు. మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ విధానాలను ఖరారు చేసిన తర్వాత గోయెల్ కంపెనీ నుండి నిష్క్రమించనున్నారు. అయితే గతంలో గోయెల్ పనిచేసిన మైనింగ్ దిగ్గజం వేదాంతలోనే తిరిగి చేరనున్నారు. ఈ మేరకు పరిశ్రమ నిపుణుడు ప్రదీప్ కనకియాను సీనియర్ సలహాదారుగా బైజూస్ నియమించింది. ప్రస్తుతం స్టార్ట్-అప్ ఫైనాన్స్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న నితిన్ గోలానీని CFO పాత్రకు పదోన్నతి కల్పించింది.
ఇప్పటికే దాదాపుగా 10,000 ఉద్యోగాలను తొలగించిన బైజూస్
ఒకప్పుడు IPO కోసం 50 బిలియన్ డాలర్ల వరకు విలువైందిగా అంచనా ఉన్న భారతదేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ బైజూస్,ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కోంటోంది. ఇందుకు తాజా పరిణామమే ఉదాహరణగా నిలుస్తోంది. ఓపక్క బైజూస్ అనేక పాలనపరమైన, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఇంకోపక్క $1.2 బిలియన్ల టర్మ్-బి రుణంపై రుణదాతల కన్సార్టియంతో చర్చలు జరుపుతోంది. ఇదే సమయంలో డేవిడ్‌సన్ కెంప్‌నర్‌తో మరో వివాదంలో చిక్కుకుంది. ప్రారంభంలో $250 మిలియన్ల క్రెడిట్‌ని అందించేందుకు ఈ సంస్థ అంగీకరించింది. కానీ ప్రస్తుతం సాంకేతిక డిఫాల్ట్ నిబంధనపై తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులు మారినప్పటి నుంచి బైజూస్ దాదాపుగా 10,000 ఉద్యోగాలను తొలగించింది. మార్చి 2022కి ఆర్థిక ఖాతాను సమర్పించడాన్ని స్థిరంగా వాయిదా వేసింది.