EPS pension hike: ఈపీఎస్ కనీస పెన్షన్ పెరుగుతుందా? నవంబర్ 19న కీలక భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద ప్రస్తుతం అందిస్తున్న కనీస పింఛను మొత్తాన్ని పెంచాలనే డిమాండ్‌పై త్వరలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ అంశంపై నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. నవంబర్ 19న గుజరాత్‌లో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో కనీస పెన్షన్ పెంపు అంశాన్ని చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈపీఎస్ కింద అర్హులైన పెన్షనర్లకు నెలకు కనీసం రూ.1,000 పింఛను అందుతోంది. ఈ మొత్తాన్ని చివరిసారిగా 2014 సెప్టెంబర్‌లో సవరించారు. అప్పటి నుంచి ధరలు పెరగడంతో ప్రస్తుత పెన్షన్ జీవన ఖర్చులకు సరిపోవడం లేదని పెన్షనర్లు చెబుతున్నారు.
వివరాలు
కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న పెన్షనర్ల సంఘాలు
కనీస పింఛనును నెలకు రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నెరవేర్చాలని పెన్షనర్ల సంఘాలు కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాయి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే పెన్షనర్లు కోరుతున్నట్లుగా రూ.7,500కు పెంచుతారా? లేదా కొంత మొత్తాన్ని మాత్రమే పెంచుతారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు.
కనీస పెన్షన్ పెంపునకు ఎంత నిధులు అవసరమవుతాయి? బడ్జెట్‌లో ఎంత మొత్తాన్ని కేటాయించాలి? అనే అంశాలపై రానున్న సీబీటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
వివరాలు
ఈపీఎస్ పెన్షన్ నిధికి యజమాని చెల్లించే వాటాలో 8.33 శాతం జమ
ఈపీఎస్ పెన్షన్ నిధికి యజమాని చెల్లించే వాటాలో 8.33 శాతం జమ అవుతుంది.
సవరించిన గరిష్ఠ వేతన పరిమితి ప్రకారం నెలకు రూ.2,083 వరకు ఈ నిధికి చేరుతుంది.
పెన్షనర్‌కు ఎంత మొత్తం చెల్లించాలనేది లెక్కించేందుకు పెన్షనబుల్ వేతనాన్ని, పెన్షనబుల్ సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారు.
పెన్షన్ లెక్కింపు కోసం పెన్షనబుల్ వేతనం × పెన్షనబుల్ సర్వీసు ÷ 70 అనే సూత్రాన్ని ఉపయోగిస్తారు.
వివరాలు
లోటును ప్రభుత్వం భర్తీ చేస్తుంది
ఈ లెక్కింపు ప్రకారం వచ్చే పెన్షన్ మొత్తం నెలకు రూ.1,000 కంటే తక్కువగా ఉంటే, ఆ లోటును ప్రభుత్వం భర్తీ చేస్తుంది.
ఒకవేళ కనీస పెన్షన్‌ను పెంచాలని నిర్ణయిస్తే, అదనంగా అవసరమయ్యే నిధులను బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంటుంది.
అందుకే పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకునే సమయంలో ఆర్థిక భారం, అవసరమైన నిధుల కేటాయింపులపై కూడా చర్చ జరగనుంది.
అయితే కనీస పెన్షన్ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే వరకు పెన్షనర్లు వేచి చూడాల్సిందే.