Loading...
LTCG Tax: ఎల్‌టీసీజీ పన్ను రద్దు చేయొచ్చా? కేంద్రానికి ఆర్థిక వెసులుబాటు ఉందన్న ఎస్‌బీఐ రీసెర్చ్
ఎల్‌టీసీజీ పన్ను రద్దు చేయొచ్చా? కేంద్రానికి ఆర్థిక వెసులుబాటు ఉందన్న ఎస్‌బీఐ రీసెర్చ్

LTCG Tax: ఎల్‌టీసీజీ పన్ను రద్దు చేయొచ్చా? కేంద్రానికి ఆర్థిక వెసులుబాటు ఉందన్న ఎస్‌బీఐ రీసెర్చ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ)ని పూర్తిగా రద్దు చేసినా,ఆర్థిక లోటును నియంత్రించే లక్ష్యాలకు పెద్దగా ఇబ్బంది ఉండదని ఎస్‌బీఐ రీసెర్చ్ వెల్లడించింది. ఈ పన్ను రద్దు వల్ల 2027-28 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.40,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్ల వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. అయినప్పటికీ ఈ నష్టాన్ని భరించే ఆర్థిక వెసులుబాటు కేంద్రానికి ఉందని పేర్కొంది. ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా ఎకోరాప్ నివేదిక ప్రకారం.. అన్ని రకాల పెట్టుబడిదారులకు ఎల్‌టీసీజీ పన్నును రద్దు చేసినా, కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లోటు నియంత్రణ ప్రణాళికలను కొనసాగించగలదు. ఆదాయంలో తగ్గుదల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.1 నుంచి 0.2 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది.

వివరాలు 

ఎల్‌టీసీజీ పన్ను ఆదాయం ఎంత?

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌టీసీజీ పన్ను వసూళ్లు సుమారు రూ.1 లక్ష కోట్లుగా ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.

2026-27లో ఇవి రూ.40,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు తగ్గవచ్చని తెలిపింది. 2024-25లో వచ్చిన రూ.1.3 లక్షల కోట్ల వసూళ్లు అసాధారణంగా అధికమని పేర్కొంది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ సుమారు 30 శాతం రాబడులు ఇవ్వడంతో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై లాభాలను పొందారని నివేదిక వివరించింది.

ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపింది. గత మూడేళ్లలో నిఫ్టీ సగటు రాబడి కేవలం 0.5 శాతంగా ఉండగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) రూ.4.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని పేర్కొంది.

వివరాలు 

పన్ను తగ్గింపునకు ప్రత్యామ్నాయాలు

ఈ పరిస్థితుల్లో అన్ని రకాల మూలధన లాభాల పన్నులను రద్దు చేసినా, కేంద్ర ప్రభుత్వం ఆ నష్టాన్ని భరించగలదని ఎస్‌బీఐ రీసెర్చ్ అభిప్రాయపడింది.

ఎల్‌టీసీజీ పన్నును పూర్తిగా రద్దు చేయడంతో పాటు, ప్రస్తుత పన్ను విధానంలో కొన్ని మార్పులు చేయాలని నివేదిక సూచించింది. -

ప్రస్తుతం ఏడాదికి రూ.1.25 లక్షలుగా ఉన్న ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ పరిమితిని సవరించాలి.

రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు పెట్టుబడులను కొనసాగించిన వారికి వచ్చే లాభాలపై 5 శాతం పన్ను విధించాలి.

మూడేళ్లకు మించి పెట్టుబడులను కొనసాగించిన వారికి ఎల్‌టీసీజీ పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి.

ADVERTISEMENT

వివరాలు 

పన్ను తగ్గింపునకు ప్రత్యామ్నాయాలు

ఏడాది నుంచి రెండేళ్ల మధ్య పెట్టుబడులపై ప్రస్తుతం ఉన్న 12.5 శాతం పన్నును కొనసాగించాలి.

పన్ను ఆదాయం తగ్గుదలను కొంతవరకు భర్తీ చేసేందుకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీపీ)ను 50 శాతం పెంచాలని నివేదిక సూచించింది.

ఈ మార్పు ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.45,000 కోట్ల అదనపు ఆదాయం రావచ్చని అంచనా వేసింది.

అలాగే మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని 90 రోజుల్లోపు అర్హత కలిగిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో తిరిగి పెట్టుబడి పెడితే, ఎల్‌టీసీజీ పన్ను చెల్లింపును వాయిదా వేయాలని ప్రతిపాదించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఎల్‌టీసీజీ పన్ను రద్దుతో ప్రయోజనాలు

భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో, ఎల్‌టీసీజీ పన్ను రద్దు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ అభిప్రాయపడింది.

దీంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడంతో పాటు, భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రపంచ పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారవచ్చని పేర్కొంది.

రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు పెట్టుబడులను కొనసాగించే వారికి పన్ను రాయితీలు కల్పించడం ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించవచ్చని నివేదిక సూచించింది.

ADVERTISEMENT