Income Tax Notice on UPI: యూపీఐ లావాదేవీలపై ఐటీ నోటీసులు వస్తాయా? ఈ ట్రాన్సాక్షన్లపై తప్పనిసరిగా నిఘా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం నగదు వినియోగం కంటే యూపీఐ (UPI), నెఫ్ట్ (NEFT), ఆర్‌టీజీఎస్ (RTGS), ఐఎంపీఎస్ (IMPS) వంటి డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు పంపినా లేదా స్వీకరించినా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తాయా అనే సందేహం చాలామందిలో నెలకొంది. పన్ను నిపుణుల ప్రకారం, కేవలం యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లేదా ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు చేసినందుకు మాత్రమే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపదు. అయితే డిజిటల్ లావాదేవీలు, ఐటీఆర్‌లో ప్రకటించిన ఆదాయం, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఇతర ఆర్థిక సమాచారంలో వ్యత్యాసాలు ఉంటే మాత్రం ఆ లావాదేవీలు ఐటీ శాఖ దృష్టిలో పడే అవకాశం ఉంటుంది.
వివరాలు
ఏ పరిస్థితుల్లో ఐటీ నోటీసులు వస్తాయో తెలుసుకోండి
దీనికి ఉదాహరణగా ఇటీవల ఓ వ్యక్తి సుమారు రూ.50లక్షలకు పైగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించినప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు.
దీంతో అంత మొత్తానికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై అనుమానం వ్యక్తం చేసిన ఐటీ శాఖ అతనికి నోటీసులు జారీ చేసింది.
అంటే లావాదేవీలు జరగడమే కారణం కాదు.. వాటికి సరైన ఆధారాలు ఉన్నాయా లేదా అనేదే శాఖ పరిశీలించే ప్రధాన అంశం.
ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ వార్షిక సమాచార ప్రకటన (AIS),ఫారం 26AS, స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ (SFT)వంటి వ్యవస్థల ద్వారా పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీలను విశ్లేషిస్తోంది.
వివరాలు
కొన్ని సందర్భాల్లో ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం
బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రిజిస్ట్రేషన్ శాఖలు, స్టాక్ బ్రోకర్లు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అందే సమాచారాన్ని పాన్ నంబర్ ఆధారంగా సరిపోల్చి పరిశీలిస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంటుంది.
ఫారం 26AS లేదా AISలో నమోదైన టీడీఎస్ వివరాలను ఐటీఆర్‌లో చూపించకపోవడం,బ్యాంక్ ఖాతాల్లో తరచూ పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు జమవుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఆదాయం ప్రకటించకపోవడం, నెఫ్ట్ లేదా ఆర్‌టీజీఎస్ ద్వారా ఖరీదైన స్థిరాస్తులు కొనుగోలు చేసి ఆ నిధుల మూలాన్ని వివరించలేకపోవడం వంటి పరిస్థితుల్లో నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.
వివరాలు
ఈ ట్రాన్సాక్షన్లపై కచ్చితంగా నోటీసులు?
కొన్ని అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీల వివరాలను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. వాటిలో ముఖ్యంగా..
ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేయడం.
కరెంట్ ఖాతాల్లో ఏడాదిలో రూ.50 లక్షలకు మించిన నగదు లావాదేవీలు నిర్వహించడం.
రూ.10 లక్షలకు మించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) చేయడం.
రూ.10 లక్షలకు మించిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెట్టడం.
రూ.45 లక్షలకు పైబడిన స్థిరాస్తుల కొనుగోలు.
నగదు కాకుండా క్రెడిట్ కార్డు బిల్లుల రూపంలో రూ.10 లక్షలకు మించిన చెల్లింపులు చేయడం.
వివరాలు
ఐటీఆర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు
ఇలాంటి లావాదేవీల వివరాలు ఐటీ శాఖకు చేరే అవకాశం ఉంటుంది. అవసరమైతే వాటికి సంబంధించిన వివరాలు, నిధుల మూలం, పత్రాలను సమర్పించాలని నోటీసులు జారీ చేయవచ్చు.
అయితే ఇలాంటి లావాదేవీలు జరిగిన ప్రతిసారీ నోటీసులు వస్తాయని భావించడం సరైంది కాదు.
చట్టబద్ధంగా సంపాదించిన ఆదాయాన్ని ఐటీఆర్‌లో సక్రమంగా చూపించి, సంబంధిత పత్రాలను భద్రంగా ఉంచుకుంటే సాధారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.
అయితే పన్ను పరిధిలోకి వచ్చినప్పటికీ ఐటీఆర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
జరిమానాతో పాటు జైలు శిక్ష వంటి నిబంధనలు కూడా వర్తించవచ్చు.
వివరాలు
టాక్స్ నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు
AISలో నమోదైన వివరాలను తరచూ పరిశీలించి బ్యాంక్ రికార్డులతో సరిపోల్చుకోవాలి.
పెద్ద మొత్తంలో పెట్టుబడులు లేదా చెల్లింపులు చేసినప్పుడు వాటికి సంబంధించిన అన్ని ఆధారాలను భద్రంగా ఉంచుకోవాలి.
వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు, వ్యాపార ఖాతాలను వేరుగా నిర్వహించాలి.
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలను ఐటీఆర్‌లో తప్పకుండా ప్రకటించాలి.
ఆదాయం, లావాదేవీలు, ఐటీఆర్‌లో ఇచ్చిన వివరాలు పరస్పరం సరిపోలేలా చూసుకుంటే అనవసరంగా ఐటీ నోటీసులు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.