Diesel And Petrol: వెనెజువెలా భూకంపాల ప్రభావం.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
ఈ వార్తాకథనం ఏంటి
భారీ ప్రకృతి విపత్తుతో వెనిజులా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలతో దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు భవనాలు కూలిపోగా, అనేక ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రపంచంలో ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన వెనెజువెలాలో ఈ విపత్తు చోటుచేసుకోవడంతో అంతర్జాతీయ చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడే భారత్‌పై దీని ప్రభావం ఉంటుందా? పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వివరాలు
చమురు క్షేత్రాల పరిస్థితి ఎలా ఉంది?
రాజధాని కారకస్‌తో పాటు వెనెజువెలాలోని పలు నగరాలు భూకంపాల తీవ్రతను చవిచూశాయి. అయితే చమురు మౌలిక సదుపాయాల పరిస్థితిపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. రిఫైనరీలు,ఎగుమతి టెర్మినళ్లు, పైప్‌లైన్లకు ఎంత మేర నష్టం జరిగిందనే అంశంపై స్పష్టత లేదు. కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం చమురు క్షేత్రాలకు పెద్దగా నష్టం జరగలేదని, ఉత్పత్తి కూడా ఇప్పటివరకు కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే విద్యుత్ అంతరాయం, రవాణా వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
చమురు క్షేత్రాల పరిస్థితి ఎలా ఉంది?
వెనెజువెలాకు కీలక కార్గో కేంద్రంగా గుర్తింపు పొందిన లా గువేరా నగరం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రాంతాన్ని ఇప్పటికే డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి చమురు ఎగుమతుల్లో అంతరాయం ఏర్పడే అవకాశముంది. చమురు లోడింగ్‌లో ఆలస్యం, ప్రత్యామ్నాయ రవాణా మార్గాల అన్వేషణ వంటి అంశాలు ట్రేడర్లు, రిఫైనరీలు, బీమా సంస్థలపై ప్రభావం చూపే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత వెనెజువెలాపై భారత్ దృష్టి
పశ్చిమాసియాలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు దిగుమతుల కోసం భారత్ ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెనెజువెలా నుంచి సగటున నెలకు 64 వేల మెట్రిక్ టన్నుల చమురును దిగుమతి చేసుకున్న భారత్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే నెలల మధ్య ఈ పరిమాణాన్ని దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. అంతేకాకుండా వెనెజువెలా చమురు రంగంలో భారత సంస్థలు ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెట్టాయి.
వివరాలు
భారత్‌లో ఇంధన ధరలు పెరుగుతాయా?
వెనెజువెలా భూకంపాల ప్రభావంతో భారత్‌లో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణా మళ్లీ సాధారణ స్థితికి చేరుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా తగ్గుముఖం పట్టడం భారత్‌కు ఊరటనిస్తోంది. అదనంగా గత కొన్నేళ్లుగా భారత్ చమురు దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి పెంచింది. ప్రస్తుతం దాదాపు 35కు పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల వెనెజువెలా నుంచి తాత్కాలికంగా సరఫరా తగ్గినా, ఇతర దేశాల ద్వారా అవసరమైన చమురును సమకూర్చుకునే అవకాశం భారత్‌కు ఉందని ఎనర్జీ రంగ నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
పూర్తి ప్రభావం తెలుసుకోవడానికి మరికొంత సమయం
భూకంపాల అనంతరం చమురు క్షేత్రాలు, భూగర్భ పైప్‌లైన్ వ్యవస్థలు, రిఫైనరీలు, ఇతర మౌలిక సదుపాయాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. అసలు నష్టం ఎంత మేర జరిగిందో అంచనా వేయడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల వెనెజువెలా భూకంపాల వల్ల ప్రపంచ చమురు మార్కెట్‌పై,అలాగే భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.