
Stock Market: కాల్పుల విరమణ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠలో కదులుతూ భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు, శనివారం కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి.
సోమవారం ఉదయం నుంచే మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రోజంతా ఊహించని రీతిలో దూసుకుపోయి చివరికి 2,950 పాయింట్ల వృద్ధితో 82,404 వద్ద ముగిసింది.
మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 912 పాయింట్ల లాభంతో 24,920 వద్ద స్థిరపడింది. అంటే, ఒక్క రోజులోనే స్టాక్ మార్కెట్లు సుమారు 3 శాతం పెరుగుదల నమోదు చేశాయి. దీనికి ప్రధాన కారణం భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే
Details
పెట్టుబడిదారుల్లో విశ్వాసం
రెండు దేశాల మధ్య పరిస్థితులు శాంతియుతంగా మారుతాయన్న ఆశావాహక వాతావరణం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.
ఇక అంతర్జాతీయంగా కూడా సానుకూల వార్తలే వినిపిస్తున్నాయి. అమెరికా-చైనా మధ్య సాగుతున్న టారిఫ్ చర్చలు సానుకూలంగా ముగిశాయి.
ఇరు దేశాలూ తమ తమ దిగుమతులపై విధిస్తున్న సుంకాలను తగ్గించుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి.
ప్రస్తుతం చైనా, అమెరికా దిగుమతులపై 125 శాతం టారిఫ్ విధిస్తుండగా, తాజా ఒప్పందంతో ఈ శాతం 10కు తగ్గనుంది. అదే విధంగా అమెరికా, చైనా దిగుమతులపై విధిస్తున్న 145 శాతం టారిఫ్‌ను 30 శాతానికి తగ్గించనుంది.