Page Loader
యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు
యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

వ్రాసిన వారు Stalin
May 22, 2023
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాంటీట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ డిప్యూటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. యాంటీట్రస్ట్ కార్యకలాపాలకు పాల్పడినట్లు, వినియోగదారులకు చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో గూగుల్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడం, డెవలపర్‌లను పక్కదారి పట్టించడం వంటి రెండు కేసుల్లో భారతదేశ యాంటీట్రస్ట్ బాడీ సీసీఐ గూగుల్‌కు 275 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.

గూగుల్

కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఇంకా స్పందించని గూగుల్

గూగుల్ చేసిన తప్పులపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్యూటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై మంత్రి వెల్లడించలేదు. గూగుల్‌పై వచ్చిన ఆరోపణలు డిజిటల్ వ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన అంగీకరించారు. అయితే గూగుల్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అంశంపై మంత్రిత్వ శాఖ క్షుణ్ణంగా పరిశీలించిందని ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్ర ఐటీ సహాయ మంత్రి వ్యాఖ్యలపై గూగుల్ ఇంకా స్పందించలేదు. ఈ అంశం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి ఎక్కువగా మాట్లడలేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారతదేశంలో 620 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లలో దాదాపు 97శాతం ఆండ్రాయిడ్‌తోనే నడుస్తున్నాయి. అందుకే గూగుల్‌కు భారత మార్కెట్ చాలా కీలకం.