Loading...
MPMS: చైనా ఫోన్లకు చెక్‌ పెట్టేలా కేంద్రం మాస్టర్‌ప్లాన్‌.. దేశీయ బ్రాండ్‌లకు భారీ ప్రోత్సాహకాలు!
చైనా ఫోన్లకు చెక్‌ పెట్టేలా కేంద్రం మాస్టర్‌ప్లాన్‌.. దేశీయ బ్రాండ్‌లకు భారీ ప్రోత్సాహకాలు!

MPMS: చైనా ఫోన్లకు చెక్‌ పెట్టేలా కేంద్రం మాస్టర్‌ప్లాన్‌.. దేశీయ బ్రాండ్‌లకు భారీ ప్రోత్సాహకాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని మరింత పెంచడంతో పాటు స్వదేశీ బ్రాండ్‌లను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.62,500 కోట్ల ప్రోత్సాహకాలతో రూపొందించిన 'మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకం (ఎంపీఎంఎస్‌)' మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ పథకం 2026 ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

వివరాలు

రెండు విభాగాలుగా ఎంపీఎంఎస్

ఎంపీఎంఎస్‌ను రెండు విభాగాలుగా రూపొందించారు.

ఒకటి దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని ప్రోత్సహించడం కాగా.. రెండోది దేశీయ మొబైల్‌ బ్రాండ్‌లకు మద్దతు ఇవ్వడం.

భారత్‌లో తయారీ లేదా అసెంబ్లింగ్‌ ద్వారా 2025-26లో రూ.10,000 కోట్ల టర్నోవర్‌ సాధించిన అంతర్జాతీయ మొబైల్‌ కంపెనీలు కూడా ఈ పథకం కింద అర్హత పొందుతాయి.

కనీసం 51 శాతం భారతీయ యాజమాన్యం కలిగిన ఎలక్ట్రానిక్స్‌ కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌ (ఈఎంఎస్‌), మొబైల్‌ కంపెనీలకు 2025-26లో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ ఉన్నా పథకంలో పాల్గొనే అవకాశం కల్పించారు.

వీటికి ఏడాది పాటు జెస్టేషన్‌ పీరియడ్‌ కూడా ఉంటుంది.

వివరాలు

ఏటా రూ.5 వేల కోట్ల అదనపు అమ్మకాలు తప్పనిసరి

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న మొబైల్‌ బ్రాండ్‌లు 2025-26 అమ్మకాలతో పోలిస్తే ఏటా కనీసం రూ.5,000 కోట్ల అదనపు విక్రయాలను సాధించాలి.

2026-27లో రూ.5,000 కోట్లు, 2027-28లో రూ.10,000 కోట్లు, 2028-29లో రూ.15,000 కోట్లు, 2029-30లో రూ.20,000 కోట్లు, 2030-31లో రూ.25,000 కోట్ల అదనపు అమ్మకాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

కొత్తగా మార్కెట్లోకి వచ్చే బ్రాండ్‌లు దేశంలో వార్షికంగా రూ.10,000 కోట్ల మొత్తం విక్రయాలను సాధించిన తర్వాతే పథక ప్రయోజనాలకు అర్హత పొందుతాయి.

2026-27, 2027-28లో అర్హత కలిగిన అమ్మకాలపై 2.75 శాతం, 2028-29, 2029-30లో 2.50 శాతం, 2030-31లో 2.25 శాతం చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తారు.

ADVERTISEMENT

వివరాలు

కీలక విడిభాగాల తయారీకి అదనపు బోనస్

డిస్‌ప్లే మాడ్యూళ్లు, బ్యాటరీలు, యూఎస్‌బీ కేబుళ్లు వంటి కీలక మొబైల్‌ విడిభాగాలను దేశీయంగానే సమీకరించే కంపెనీలకు అమ్మకాలపై అదనంగా 1.5 శాతం వరకు బోనస్‌ ఇన్సెంటివ్‌ లభిస్తుంది.

ఈ పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది.

దీని నిర్వహణను ప్రత్యేక ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

10-14 నెలల్లో దేశీయ డిజైన్‌ ఫోన్లు

భారత్‌లోనే పూర్తిగా డిజైన్‌ చేసి, సొంత మేధో సంపత్తి హక్కులు కలిగిన కొత్త దేశీయ మొబైల్‌ ఫోన్లు రాబోయే 10-14 నెలల్లో మార్కెట్లోకి వస్తాయని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ఎంపీఎంఎస్‌ కింద దేశీయ బ్రాండ్‌ల ఎంపికలో ప్రభుత్వం కఠిన ప్రమాణాలను పాటిస్తుందని, విదేశీ ఫోన్లను కాపీ చేసే సంస్థలకు పథకం ప్రయోజనాలు అందవని స్పష్టం చేశారు.

ఎంపీఎంఎస్‌ ద్వారా వచ్చే ఐదేళ్లలో దేశంలో మొబైళ్ల ఉత్పత్తి విలువ దాదాపు రెట్టింపై రూ.39 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

ఈ పథకం ద్వారా సుమారు 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ADVERTISEMENT