LOADING...
Cisco layoff: AI పునర్వ్యవస్థీకరణలో భాగంగా 4 వేల ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనున్న సిస్కో
AI పునర్వ్యవస్థీకరణలో భాగంగా 4 వేల ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనున్న సిస్కో

Cisco layoff: AI పునర్వ్యవస్థీకరణలో భాగంగా 4 వేల ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనున్న సిస్కో

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ నెట్‌వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ Cisco Systems భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. AI ఆధారిత వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2026 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో దాదాపు 4 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి తక్కువగానే ఉంటుందని తెలిపింది. కంపెనీ CEO చక్ రాబిన్స్ త్రైమాసిక ఫలితాల అనంతరం విడుదల చేసిన బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. తొలగింపుకు గురయ్యే ఉద్యోగులకు ఇవాళ్టి నుంచే సమాచారం అందజేస్తామని, వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిస్కో ప్లేస్‌మెంట్ సేవల ద్వారా సహాయం చేస్తామని చెప్పారు.

వివరాలు 

సిస్కో నికర లాభం 3.4 బిలియన్ డాలర్లు

ఇదిలా ఉంటే, 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సిస్కో బలమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగి 15.8 బిలియన్ డాలర్లకు చేరగా, నికర లాభం 3.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 2.5 బిలియన్ డాలర్లుగా ఉండింది. AI టెక్నాలజీపై సంస్థ మరింత దృష్టి పెట్టింది. ముఖ్యంగా సిలికాన్, ఆప్టిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఉద్యోగుల AI వినియోగం వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్‌లో కస్టమర్లు, భాగస్వాములకు ఉపయోగపడే కొత్త టెక్నాలజీల అభివృద్ధిపైనే తమ దృష్టి ఉందని చక్ రాబిన్స్ పేర్కొన్నారు.

వివరాలు 

మూడో త్రైమాసికంలో పెరిగిన ప్రొడక్ట్ ఆర్డర్లు 35 శాతం

అలాగే, కంపెనీ ఉత్పత్తుల ఆర్డర్లు కూడా గణనీయంగా పెరిగాయి. మూడో త్రైమాసికంలో మొత్తం ప్రొడక్ట్ ఆర్డర్లు 35 శాతం పెరిగినట్లు వెల్లడించింది. AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5.3 బిలియన్ డాలర్ల ఆర్డర్లు పొందినట్లు తెలిపిన సిస్కో, 2026 ఆర్థిక సంవత్సరానికి AI ఆర్డర్ల లక్ష్యాన్ని 5 బిలియన్ డాలర్ల నుంచి 9 బిలియన్ డాలర్లకు పెంచింది.

Advertisement