Commercial LPG cylinder: రూ.200 తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ ఊరట!
ఈ వార్తాకథనం ఏంటి
వాణిజ్య అవసరాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా తగ్గించాయి. శనివారం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం, ఒక్కో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.200 వరకు కోత విధించాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య వినియోగదారులకు గణనీయమైన ఊరట లభించనుంది. ఫిబ్రవరిలో పశ్చిమాసియా ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అయితే ఇటీవల పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటంతో ప్రభుత్వం ధరలను దశలవారీగా తగ్గిస్తూ వస్తోంది. ఇప్పటికే జులై నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.183తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రూ.200 మేర కోత విధించడం విశేషం.
వివరాలు
వరుసగా తగ్గుతున్న ధరలు
తాజా ధరల ప్రకారం దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.202 తగ్గి రూ.2,728కు చేరింది. కోల్‌కతాలో ఇదే సిలిండర్ ధర రూ.2,872.50గా ఉండగా, హైదరాబాద్‌లో రూ.2,985కు తగ్గింది.
అయితే గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాపై ప్రభుత్వం గతంలో ఆంక్షలు విధించింది.
అనంతరం జూన్ నెలలో ఆ పరిమితులను పూర్తిగా ఎత్తివేసి, యుద్ధ సంక్షోభానికి ముందున్న స్థాయిలోనే సరఫరాలను పునరుద్ధరించింది.
సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతోనే ఇప్పుడు ధరల్లో వరుస తగ్గుదల కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.