Loading...
Copper Prices: కాపర్ ధరలకు రెక్కలు.. అమెరికా టారిఫ్ భయాలతో రాగికి భారీ డిమాండ్ ఎందుకు?
కాపర్ ధరలకు రెక్కలు.. అమెరికా టారిఫ్ భయాలతో రాగికి భారీ డిమాండ్ ఎందుకు?

Copper Prices: కాపర్ ధరలకు రెక్కలు.. అమెరికా టారిఫ్ భయాలతో రాగికి భారీ డిమాండ్ ఎందుకు?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్లో రాగి (కాపర్) ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో మూడు నెలల కాపర్ ఫ్యూచర్స్ ధర చారిత్రాత్మక గరిష్ఠాన్ని తాకింది. శుద్ధి చేసిన రాగిపై అమెరికా భారీగా దిగుమతి సుంకాలు విధించే అవకాశం ఉందన్న అంచనాలతో వ్యాపారులు ముందుగానే తమ నిల్వలను అమెరికాకు తరలిస్తుండటం తాజా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయికి కాపర్ ధర మంగళవారం ట్రేడింగ్‌లో LMEలో మూడు నెలల కాపర్ ఫ్యూచర్స్ ధర 0.8 శాతం పెరిగి మెట్రిక్ టన్నుకు 14,533 డాలర్లకు (రూ.13.73 లక్షలు) చేరింది. దీంతో గత జనవరిలో నమోదైన 14,527.50 డాలర్ల (రూ.13.72 లక్షలు) రికార్డు బద్దలైంది.

వివరాలు 

దేశీయ మార్కెట్‌పైనా ప్రభావం

2026లో ఇప్పటివరకు కాపర్ ధర సుమారు 17 శాతం పెరిగింది. గత ఏడాది కాలాన్ని పరిశీలిస్తే ఏకంగా 47 శాతం వృద్ధి నమోదైంది.

అంతర్జాతీయంగా రాగి ధరలు పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్లలోనూ అదే ధోరణి కనిపిస్తోంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సెప్టెంబర్ కాపర్ ఫ్యూచర్స్ 1.21 శాతం అంటే రూ.16.8 పెరిగాయి.

ఉదయం 10:30 గంటల సమయానికే కిలోకు రూ.1,403.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకాయి.

మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ షేర్లు కూడా బీఎస్‌ఈలో 5 శాతానికి పైగా లాభపడి రూ.537.35 వద్ద ట్రేడయ్యాయి.

వివరాలు 

డేటా సెంటర్లు.. గ్రీన్ ఎనర్జీతో డిమాండ్

రాగి ధరలు పెరగడానికి దీర్ఘకాలికంగా అనేక కారణాలు ఉన్నాయి.

డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, విద్యుత్ ప్రసార వ్యవస్థల (పవర్ గ్రిడ్స్) విస్తరణతో కాపర్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది.

విద్యుత్‌ను ప్రసారం చేయడం, పరికరాల్లో వినియోగించడం వంటి అవసరాల్లో రాగి కీలకమైన లోహం కావడంతో కొత్త ప్రాజెక్టులు పెరిగే కొద్దీ దాని అవసరమూ పెరుగుతోంది.

అయితే ఈ స్థాయిలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పాత గనుల నుంచి రాగి ఉత్పత్తి పెరగడం లేదు.

దీంతో సరఫరా, డిమాండ్ మధ్య అంతరం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంగా కాపర్ ధరలకు మద్దతు ఇస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

టారిఫ్ భయాలతో అమెరికాకు నిల్వల తరలింపు

అయితే ప్రస్తుతం రాగి ధరలు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా టారిఫ్‌లకు సంబంధించిన పరిణామాలే.

రిఫైన్డ్ కాపర్‌పై సుంకాల విధింపుపై అమెరికా వాణిజ్య శాఖ జూన్ 30లోగా తన నివేదికను వైట్‌హౌస్‌కు సమర్పించాల్సి ఉంది.

అయితే గడువు దాటి రెండు నెలలు గడిచినా తుది నిర్ణయం వెలువడలేదు.

దీంతో అమెరికా భారీ సుంకాలు విధించే అవకాశం ఉందని భావిస్తున్న వ్యాపారులు ముందుగానే అప్రమత్తమయ్యారు.

తమ వద్ద ఉన్న కాపర్ నిల్వలను అమెరికాకు తరలిస్తున్నారు. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో రాగి అందుబాటు తగ్గుతోంది.

ముఖ్యంగా LMEకి అనుసంధానమైన గిడ్డంగుల నెట్‌వర్క్‌లో సరఫరా తగ్గడంతో ధరలపై మరింత ఒత్తిడి ఏర్పడుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

తగ్గుతున్న గనుల ఉత్పత్తి

ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కాపర్ ఉత్పత్తి కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

2026 తొలి ఆరు నెలల్లో రాగి గనుల ఉత్పత్తి దాదాపు 1 శాతం తగ్గినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

రాగి ధాతువును ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే కాన్సన్‌ట్రేట్ ఉత్పత్తి కూడా 2.6 శాతం క్షీణించింది.

మొత్తంగా చూస్తే.. ఒకవైపు డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధనం, పవర్ గ్రిడ్ల నుంచి కాపర్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

మరోవైపు గనుల నుంచి ఉత్పత్తి, సరఫరా తగ్గుతోంది. దీనికి అదనంగా అమెరికా టారిఫ్‌లపై నెలకొన్న అనిశ్చితి వ్యాపారులను ముందుగానే నిల్వలు తరలించేలా చేస్తోంది.

ఈ మూడు అంశాల ప్రభావమే రాగి ధరలను చారిత్రాత్మక గరిష్ఠాలకు తీసుకెళ్లింది.

ADVERTISEMENT