LOADING...
Crude oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ముడిచమురు ధరల్లో టెన్షన్.. బ్రెంట్‌ ధర $120కు చేరొచ్చన్న సిటీ
బ్రెంట్‌ ధర $120కు చేరొచ్చన్న సిటీ

Crude oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ముడిచమురు ధరల్లో టెన్షన్.. బ్రెంట్‌ ధర $120కు చేరొచ్చన్న సిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉన్న వివాదం త్వరలో ముగిసే అవకాశముందని వ్యాఖ్యానించినప్పటికీ.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభావంతో బుధవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 45 సెంట్లు తగ్గి 110.83 డాలర్లకు చేరగా.. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర 27 సెంట్లు పడిపోయి 103.88 డాలర్ల వద్ద ట్రేడైంది. అయితే దేశీయ మార్కెట్‌లో మాత్రం ముడిచమురు ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ (MCX)లో క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 0.70 శాతం ఎగిసి బ్యారెల్‌కు రూ.10,095 వద్ద నమోదయ్యాయి.

వివరాలు 

మార్కెట్లలో ఆందోళన పెంచిన ట్రంప్ వ్యాఖ్యలు

ఇక మార్కెట్‌పై ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ సైనిక చర్యలు జరిగే అవకాశాలే. అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లలో ఆందోళన పెంచాయి. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి గంట సమయం ఉండగా గల్ఫ్‌ దేశాల విజ్ఞప్తితో తాత్కాలిక విరామం ఇచ్చామన్నారు. మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్‌ను తెహ్రాన్ తిరస్కరిస్తుండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. ఫిబ్రవరి చివరి నుంచి కొనసాగుతున్న దాడుల కారణంగా హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింది.

వివరాలు 

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సరఫరా అంతరాయం

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సరఫరా అంతరాయం ఇదేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సిటీ (Citi) కీలక అంచనాలు వెల్లడించింది. సరఫరా అంతరాయం మరింత కాలం కొనసాగితే బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

వివరాలు 

మార్కెట్ ప్రస్తుతం ప్రమాద స్థాయిని తక్కువగా అంచనా వేస్తోంది 

మార్కెట్ ప్రస్తుతం ప్రమాద స్థాయిని తక్కువగా అంచనా వేస్తోందని హెచ్చరించింది. టెక్నికల్‌గా చూస్తే MCXలో రూ.10,000 నుంచి రూ.10,050 స్థాయిలు కీలక నిరోధంగా ఉన్నాయని ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్ తెలిపారు. ఈ స్థాయిని దాటితే ధరలు రూ.10,150 నుంచి రూ.10,300 వరకు వెళ్లే అవకాశముందని చెప్పారు. మరోవైపు రూ.9,800-రూ.9,750 స్థాయిలు మద్దతుగా పనిచేస్తాయని.. ఆ స్థాయి కంటే దిగివస్తే ధరలు రూ.9,700 నుంచి రూ.9,600 వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement