Second Instalment of Advance Tax:రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ గడువు సమీపిస్తోంది..డెడ్‌లైన్ మిస్ అయితే పెనాల్టీ తప్పదు..ఇప్పుడే కట్టేయండి!
2024-2025 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను రెండవ విడత చెల్లించడానికి పన్ను చెల్లింపుదారులకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ముందస్తు పన్ను దాఖలు చేయడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2024. మీరు ఈ తేదీలోపు ముందస్తు పన్ను చెల్లించకపోతే, మీరు సెక్షన్లు 234B, 234C కింద జరిమానా చెల్లించాలి.
అడ్వాన్స్ ట్యాక్స్ సంవత్సరానికి 4 సార్లు చెల్లించాలి
ఆదాయాన్ని ఆర్జించిన అదే ఆర్థిక సంవత్సరంలోనే ముందస్తు పన్ను చెల్లించబడుతుంది. దీన్ని ఆర్థిక సంవత్సరంలో నాలుగు సార్లు చెల్లించాలి. అంటే నాలుగు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు జూన్ 15 నాటికి మొత్తం పన్ను బాధ్యతలో 15 శాతం చెల్లించాలి. సెప్టెంబర్ 15లోగా 45 శాతం చెల్లించాల్సి ఉంది. ఇందులో జూన్ 15 వరకు చెల్లించిన పన్ను కూడా ఉంది. డిసెంబర్ 15 నాటికి చెల్లించాల్సింది 75%, ఇందులో జూన్,సెప్టెంబర్ వాయిదాలు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మార్చి 15లోగా 100% పన్ను చెల్లించాలి.
ముందస్తు పన్ను: నాలుగు వాయిదాలలో చెల్లింపు
ఆదాయాన్ని ఆర్జించిన అదే ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగు వాయిదాలలో చెల్లించాలి: 15% - జూన్ 15 వరకు 45% - సెప్టెంబర్ 15 నాటికి (మొదటి విడత కూడా ఇందులో చేర్చబడింది) 75% - డిసెంబర్ 15 నాటికి (1వ, 2వ విడతతో కలిపి) 100% - మార్చి 15 వరకు
ముందస్తు పన్ను ఎవరు చెల్లించాలి?
ఆదాయపు పన్ను నియమాల ప్రకారం, నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వారి ఆదాయపు పన్ను రూ.10,000 పైగా ఉంటే, వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని అంచనా వేసి ముందుగా చెల్లించడం. దీన్ని ఒకేసారి కాకుండా, విడతల వారీగా ఆర్థిక సంవత్సరానికి ముందు పూర్తిగా చెల్లించాలి. ఉద్యోగుల శాలరీల నుంచి కంపెనీలు టీడీఎస్ కట్ చేస్తాయి కాబట్టి వారు చెల్లించాల్సిన అవసరం లేదు. జీతం కాకుండా, ఇందులో అద్దె, మూలధన లాభం, FD వడ్డీ లేదా లాటరీ గెలుచుకోవడం ద్వారా వచ్చే ఆదాయం కూడా ఉంటుంది.
ముందస్తు పన్ను చెల్లించకపోతే ఏమవుతుంది?
గడువు దాటితే ఆదాయపు పన్ను విభాగం జరిమానా విధిస్తుంది. సెక్షన్ 234సీ ప్రకారం, ఎవరైతే చెల్లింపులు మిస్ అవుతారో, వారు చెల్లించాల్సిన పన్ను పై 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 234బీ ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే నాటికి అడ్వాన్స్ ట్యాక్స్ మొత్తంలో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ చెల్లించకపోతే, లేదా అసలు మొత్తాన్ని చెల్లించకపోతే, ట్యాక్సుపై నెలకు 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, సెక్షన్ 234ఏ ప్రకారం, గడువు ముగిసిన తర్వాత చెల్లించినా, నెలకు 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15లోపు మొత్తం పన్నులో 45 శాతం చెల్లించకపోతే, 3 నెలల బకాయిలపై 1 శాతం వడ్డీ రూపంలో పన్ను పడుతుంది.