EPF pension alert: దీపావళి పండగ వేళ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. ఆ తేదీలోపే వారి ఖాతాల్లోకి డబ్బులు..
ఈ సంవత్సరం దీపావళి పండగ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో, ప్రజలు తమ షాపింగ్ పూర్తిచేస్తున్నారు. అయితే, దీపావళి నెలాఖరుకు రావడంతో, వేతన జీవులు, పింఛనుదారులకు డబ్బులు జమ అయ్యే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కు సంబంధించిన పింఛనుదారులకు శుభవార్త అందించింది ఈపీఎఫ్ఓ. ఈసారి, పింఛనుదారులకు రెండు రోజులు ముందుగా పెన్షన్ అందుబాటులో ఉండనుంది. ఈ సందర్భంగా, అక్టోబర్ 31న జరగబోయే దీపావళి పండగను దృష్టిలో పెట్టుకుని, అక్టోబర్ నెల పెన్షన్ అక్టోబర్ 29, 2024న పింఛనుదారుల ఖాతాల్లో జమ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ మేరకు ఒక అధికారిక సర్క్యూలర్ విడుదల చేసింది.
పబ్లిక్ హాలీడేస్‌ను పరిగణనలోకి తీసుకుని.. పెన్షనర్ల ఖాతాల్లో డబ్బులు
"దీపావళి పండగ సంబరాలు, పబ్లిక్ హాలీడేస్‌ను పరిగణనలోకి తీసుకుని, అక్టోబర్ 2024 నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించాం. అక్టోబర్ 29, 2024న పెన్షనర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నాం. అక్టోబర్ 31న హాలీడే ఉన్నందున, పెన్షనర్లు అక్టోబర్ 30న తమ డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కలిగి ఉంటారు" అని ఈపీఎఫ్ఓ తన సర్క్యూలర్‌లో వివరించింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల కొరకు నెలవారీ బ్యాంక్ సయోధ్య స్టేట్మెంట్స్ (Bank Reconciliation Statements)ను పంపించాల్సిన ఆదేశాలు కూడా ఈపీఎఫ్ఓ జారీ చేసింది. ఈ నేపథ్యంలో,ఈ నెల చివరి పనిదినం లోపు పెన్షనర్ల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశముందని తెలిపింది.
అక్టోబర్ 29 లోపు బీఆర్ఎస్
అక్టోబర్ 29 లోపు బీఆర్ఎస్ పంపించాలని స్పష్టం చేసింది. అలాగే, తమ పరిధిలో ఉన్న పెన్షన్ పంపిణీ బ్యాంకులకు ఈ అంశంపై సూచనలు చేయాలని అన్ని జోనల్, ప్రాంతీయ ఆఫీసులను కోరింది.
ఉద్యోగులు,యాజమాన్యాలు నిర్ణీత మొత్తాలు జమ
ఈపీఎస్-95 అనేది ఒక సామాజిక భద్రత పథకం, ఇది 1995, నవంబర్‌లో ప్రారంభించబడింది. ఇది దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం రూపొందించబడింది. ఈ స్కీమ్‌లో భాగంగా, ఉద్యోగులు,యాజమాన్యాలు నిర్ణీత మొత్తాలు జమ చేయాలి. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం, ఉద్యోగి తమ జీతం నుంచి 12% పీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు, కంపెనీలు కూడా అంతే మొత్తంలో జమ చేస్తాయి. ఉద్యోగి జమ చేసే మొత్తం ఫీఎఫ్ ఖాతాలోకి పోతుంది. అలాగే, కంపెనీలు జమ చేసే 12% లో 8.33% ఈపీఎస్ పెన్షన్ స్కీమ్‌కు, మిగిలిన 3.67% పీఎఫ్ ఖాతాకు వెళ్ళుతుంది. ఉద్యోగి 58 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన తర్వాత, నెల నెలా పెన్షన్ అందిస్తారు.