Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఆగస్టు 28 నుంచి కొత్త రూల్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ తగిలింది. బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 28 నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా లేట్ పేమెంట్ ఫీజులు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, గిఫ్ట్ కార్డులపై రివార్డులకు సంబంధించి మార్పులు చేసింది. క్రెడిట్ కార్డు వినియోగించే వారు ఈ వివరాలను తప్పక తెలుసుకోవాలి.
వివరాలు
రూ.50 వేలకుపైగా బకాయి ఉంటే రూ.1,300 లేట్ ఫీజు
క్రెడిట్ కార్డు బకాయి రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఇకపై రూ.1,300 లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రూ.50 వేలలోపు బకాయిలకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలే కొనసాగుతాయి. రూ.500 వరకు బకాయి ఉంటే లేట్ ఫీజు ఉండదు.
రూ.501-రూ.5,000 వరకు రూ.500 ఛార్జీ.
రూ.5,001-రూ.10,000 వరకు రూ.750 ఛార్జీ.
రూ.10,001-రూ.50,000 వరకు రూ.1,200 ఛార్జీ.
రూ.50,000కుపైగా బకాయి ఉంటే రూ.1,300 లేట్ ఫీజు.
క్రెడిట్ కార్డు బకాయిలపై చేసిన చెల్లింపులను నిర్దిష్ట క్రమంలో సర్దుబాటు చేస్తారు. ముందుగా పన్నులతో కలిపిన ఫీజులు, ఛార్జీలకు, ఆ తర్వాత ఈఎంఐలు, వడ్డీ ఛార్జీలు, కొనుగోళ్లు, నగదు అడ్వాన్స్‌లకు చెల్లింపులు వర్తిస్తాయి.
వివరాలు
లాంజ్ యాక్సెస్‌లోనూ మార్పులు
ఆగస్టు 28 నుంచి దేశీయ విమానాశ్రయాల్లోని లాంజ్ యాక్సెస్‌కు సంబంధించి మాగ్నస్ క్రెడిట్ కార్డుపై ఉన్న ప్రియారిటీ పాస్ నిబంధనల్లో మార్పు ఉంటుంది.
ఇమ్మిగ్రేషన్ తర్వాత భారతీయ అంతర్జాతీయ టెర్మినల్స్‌లోని లాంజ్‌లను అంతర్జాతీయ లాంజ్‌లుగా పరిగణిస్తారు. వీటికి ప్రియారిటీ పాస్ ద్వారా యాక్సెస్ పొందవచ్చని బ్యాంక్ తెలిపింది.
గిఫ్ట్ కార్డులపై రివార్డులు ఉండవు
గిఫ్ట్ కార్డు కొనుగోళ్లు ఇకపై రివార్డ్స్ కేటగిరీలోకి రావు. ఆగస్టు 28 నుంచి గిఫ్ట్ కార్డ్ కొనుగోళ్లపై రివార్డులు లేదా క్యాష్‌బ్యాక్ లభించదు. వీటిని 'వాలెట్' ఖర్చుల కేటగిరీ నుంచి తొలగించి, ప్రత్యేకంగా 'గిఫ్ట్ కార్డ్స్' కేటగిరీలోకి తీసుకురానుంది.