EPFO: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తే PF వడ్డీ ఆగిపోతుందా? అసలు నిబంధన ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
చాలామంది రిటైర్మెంట్ వయస్సు వరకు ఉద్యోగం చేయరు. వివిధ కారణాలతో మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలేస్తుంటారు. భారత్‌లో సాధారణంగా రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లుగా ఉండగా.. వివిధ సెక్టార్లు, రాష్ట్రాలు, ఉద్యోగ స్వభావాన్ని బట్టి ఈ వయస్సులో వ్యత్యాసాలు ఉంటాయి. అయితే కొంతమంది 40 ఏళ్ల వయస్సులోనే ఉద్యోగం మానేస్తుంటారు. ఇలాంటి వారికి పీఎఫ్ (PF)అకౌంట్ ఉంటే.. అందులోని బ్యాలెన్స్‌పై వడ్డీ కొనసాగుతుందా? అనే సందేహం ఉంటుంది. పీఎఫ్ నిబంధనలను పరిశీలిస్తే దీనిపై స్పష్టమైన సమాధానం లభిస్తుంది. పీఎఫ్ మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ ఆగిపోదు. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి.
వివరాలు
40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేస్తే..
మీరు 40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేసినా.. 58 ఏళ్ల వయస్సు వరకు పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.
మీ పీఎఫ్ ఖాతాలోని పొదుపును విత్‌డ్రా చేసుకోకుండా ఉంటే, నిబంధనల ప్రకారం 58 ఏళ్ల వరకు వడ్డీ జమ అవుతూ ఉంటుంది.
అంటే ఉద్యోగం మానేసిన తర్వాత కూడా మీ పీఎఫ్ సొమ్ముపై వడ్డీ కొనసాగుతుంది. 40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేస్తే.. ఆ తర్వాత 18 ఏళ్ల వరకు వడ్డీ రూపంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
58 ఏళ్ల తర్వాత మీ పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్‌గా మారవచ్చు. ప్రస్తుతం పీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ రేటు కొనసాగుతోంది. భవిష్యత్తులో ఈ రేటును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
వివరాలు
మూడేళ్లుగా పీఎఫ్ వడ్డీ రేట్లు స్థిరంగా
ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఈపీఎఫ్‌ఓ (EPFO) పీఎఫ్ వడ్డీ రేటును ప్రకటిస్తూ ఉంటుంది. మూడేళ్లుగా పీఎఫ్ వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇది ఎక్కువ వడ్డీ రేటుగా చెప్పవచ్చు. పీఎఫ్‌పై వడ్డీని నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు.
ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత వడ్డీని లెక్కించి.. ఒకేసారి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.
వివరాలు
విత్‌డ్రా చేసుకుంటున్నారా..? ఒకసారి ఆలోచించండి
40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేసినప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్‌ను వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని అనిపించవచ్చు.
అయితే అలా చేసే ముందు ఒకసారి ఆలోచించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మీరు తర్వాత మరో ఉద్యోగంలో చేరితే.. పీఎఫ్ ఖాతాను కొత్త ఉద్యోగానికి బదిలీ (ట్రాన్స్‌ఫర్) చేసుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో మీ పొదుపు కొనసాగుతుంది.
పాత కంపెనీలోని పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీలోకి బదిలీ చేసుకోవడం వల్ల రెండు వేర్వేరు పీఎఫ్ ఖాతాలను నిర్వహించాల్సిన అవసరం ఉండదు.
వివరాలు
పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం మంచిది
నిధులన్నీ ఒకే ఖాతాలో ఉండటంతో గందరగోళం కూడా తగ్గుతుంది.
అందువల్ల కంపెనీలు మారినప్పుడు పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుత విధానంలో ఉద్యోగులు కంపెనీ మారినప్పుడు పీఎఫ్ ఖాతాను సులభంగా బదిలీ చేసుకునేందుకు ఆటోమేటిక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను ఈపీఎఫ్‌ఓ ప్రవేశపెట్టింది.