Loading...
Nouriel Roubini: భారత్‌ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలంటే 9 శాతం వృద్ధి అవసరం: నౌరియల్‌ రౌబిన్
భారత్‌ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలంటే 9 శాతం వృద్ధి అవసరం: నౌరియల్‌ రౌబిన్

Nouriel Roubini: భారత్‌ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలంటే 9 శాతం వృద్ధి అవసరం: నౌరియల్‌ రౌబిన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో మరింత బలపడే అవకాశాలున్నాయని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త నౌరియల్‌ రౌబినీ అభిప్రాయపడ్డారు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి 'డాక్టర్ డూమ్‌'గా గుర్తింపు పొందిన ఆయన.. రానున్న రోజుల్లో భారత్‌ ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదగగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, దేశంలోని యువతకు తగినన్ని ఉద్యోగాలు కల్పించడంతోపాటు వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు అందించాలంటే ఆర్థిక వృద్ధి రేటును ప్రస్తుత 7 శాతం నుంచి 9 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విస్తృతమైన దేశీయ మార్కెట్‌, ప్రతిభావంతులైన మానవ వనరులు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన మౌలిక అంశాలు దీర్ఘకాలంలో భారత్‌ అభివృద్ధికి తోడ్పడతాయని వివరించారు.

వివరాలు 

ప్రపంచ వాణిజ్య మార్పులు.. భారత్‌కు పెరగనున్న పెట్టుబడులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి 7 శాతం వృద్ధి సరిపోదని, యువతకు నాణ్యమైన ఉద్యోగాలు అందాలంటే 9 శాతం వృద్ధి రేటును సాధించాలని సూచించారు.

ప్రపంచ వాణిజ్యంలో చోటుచేసుకుంటున్న మార్పులు భారత్‌కు కొత్త అవకాశాలను తీసుకొస్తున్నాయని రౌబినీ విశ్లేషించారు.

చైనాపై భద్రతాపరమైన, వ్యూహాత్మక ఆందోళనలు ఉన్న ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు తమ తయారీ కార్యకలాపాలను ఆ దేశానికి వెలుపల కూడా విస్తరించాలని భావిస్తున్నాయని పేర్కొన్నారు.

మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్స్‌, సెమీకండక్టర్లకు సంబంధించిన రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని కంపెనీలు చూస్తున్నాయని తెలిపారు.

వివరాలు 

అమెరికాతో వాణిజ్య సంబంధాలు.. భారత్‌కు కొత్త అవకాశాలు

చైనాకు ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాల కోసం అన్వేషిస్తున్న సంస్థలకు భారత్‌లోని భారీ దేశీయ మార్కెట్‌ ఆకర్షణగా నిలుస్తోందని వివరించారు.

అమెరికాతో భారత్‌కు ఉన్న సన్నిహిత వాణిజ్య సంబంధాలు కూడా ఈ అవకాశాలను మరింత పెంచగలవని రౌబినీ అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణం, వినియోగదారుల కొనుగోలు శక్తికి సంబంధించిన ఆందోళనలు అమెరికా విధాన నిర్ణేతలపై ఒత్తిడి పెంచుతున్నాయని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఇతర దేశాలపై అమెరికా విధించే సుంకాలు తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేశారు.

అలాంటి పరిణామాలు ప్రపంచ వాణిజ్యానికి, భారత్‌ వంటి ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాలకు ప్రయోజనం చేకూర్చవచ్చని విశ్లేషించారు.

ADVERTISEMENT

వివరాలు 

జనాభాకు తగ్గ ఉపాధి కల్పనే కీలకం

అయితే, దేశ జనాభా ఎక్కువగా ఉండటం మాత్రమే ఆర్థిక ప్రయోజనాలను అందించదని రౌబినీ హెచ్చరించారు.

జనాభాకు అనుగుణంగా తగినన్ని ఉద్యోగాలను సృష్టించలేకపోతే ఆ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

మరోవైపు, కృత్రిమ మేధ (ఏఐ) అనేక వృత్తుల్లో ఉద్యోగాల స్వరూపాన్ని మార్చగలదని తెలిపారు.

అందువల్ల ఉపాధి కల్పన విషయంలో సాంకేతిక రంగం, వృత్తిపరమైన సేవలకే పరిమితం కాకుండా ఇతర రంగాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

తయారీ రంగం విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు

ముఖ్యంగా తయారీ రంగాన్ని వేగంగా విస్తరించడం ద్వారా ఫ్యాక్టరీలు, లాజిస్టిక్స్‌, సరఫరాదారుల నెట్‌వర్క్‌లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని రౌబినీ వివరించారు.

అత్యంత నైపుణ్యం అవసరమయ్యే సాంకేతిక, వృత్తిపరమైన ఉద్యోగాలతోపాటు వివిధ స్థాయుల్లో ఉపాధి అవకాశాలు పెరిగితే యువతకు మరింత ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు దేశ ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని 8 శాతానికి మించి తీసుకెళ్లగలవని ఆయన విశ్లేషించారు.

ADVERTISEMENT