Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌కు ఈడీ షాక్.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంకింగ్ మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ (RAAG)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో షాక్ ఇచ్చింది. గ్రూప్‌కు చెందిన రెండు చార్టర్డ్ విమానాలు సహా రూ.510 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL)కు సంబంధించి రూ.263.05 కోట్ల మోసం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCOM)కు సంబంధించి రూ.247.12 కోట్ల మోసం ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు
రెండు చార్టర్డ్ విమానాలు అటాచ్
రిలయన్స్ కమ్యూనికేషన్స్ కేసులో భాగంగా మహారాష్ట్రలో రెండు చార్టర్డ్ విమానాలు, ఆరు స్థలాలు, ఒక కార్యాలయ ప్రాంగణం సహా పలు ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది.
మరోవైపు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ కేసులకు సంబంధించి తమిళనాడులోని రెండు విండ్‌మిల్లులు, బ్యాంకు ఖాతాల్లోని నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పెట్టుబడులను అటాచ్ చేసినట్లు వెల్లడించింది.
అటాచ్ చేసిన రెండు చార్టర్డ్ విమానాల్లో దసో ఫాల్కన్ 2000, ఎంబ్రాయర్ విమానాలు ఉన్నాయి.
తాజా చర్యలతో కలిపి ఈ కేసుల్లో ఇప్పటివరకు అటాచ్ చేసిన, స్వాధీనం చేసుకున్న ఆస్తుల మొత్తం విలువ రూ.23,100 కోట్లకు చేరింది.
వివరాలు
ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న ప్రజాధనాన్ని పక్కదారి పట్టించడం, కార్పొరేట్ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు మళ్లించేందుకు దివాలా పరిష్కార చట్టాన్ని (ఐబీసీ) దుర్వినియోగం చేయడం, భారత్ నుంచి ప్రజాధనాన్ని విదేశాలకు తరలించడం వంటి వ్యవహారాల్లో ఈ గ్రూప్ ప్రమేయం ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది.
ఈ నిధుల్లో పెద్ద మొత్తాన్ని గ్రూప్ ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించినట్లు ఆరోపించింది.
ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేసిన ఈడీ.. ఆరు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.
దీనికి అదనంగా విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద మరో దర్యాప్తును కూడా ప్రారంభించింది.