EPFO: స్వయం ఉపాధి, గిగ్ వర్కర్లకు కూడా పీఎఫ్ ప్రయోజనాలు.. యూనివర్సల్ పీఎఫ్ స్కీమ్‌పై ఈపీఎఫ్‌వో కసరత్తు
ఈ వార్తాకథనం ఏంటి
స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు, మినహాయింపు పొందిన సంస్థల ఉద్యోగులకు కూడా భవిష్యనిధి (పీఎఫ్) ప్రయోజనాలను అందించే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక చర్యలు చేపడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా ప్రస్తుతం ఈపీఎఫ్‌వో పరిధిలో లేని వ్యక్తులు కూడా తమ ఆదాయంలో కొంత భాగాన్ని స్వచ్ఛందంగా పదవీ విరమణ కోసం పొదుపు చేసుకునేలా యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ (PF) స్కీమ్ తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదిత పథకంపై కేంద్ర ప్రభుత్వం లేదా ఈపీఎఫ్‌వో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వివరాలు
వార్షికంగా విరాళాలు చెల్లించుకునే వెసులుబాటు..
ఈ ప్రతిపాదిత పథకంలోని నిధుల సమీకరణ విధానం ప్రస్తుతం అమల్లో ఉన్న ఈపీఎఫ్ వ్యవస్థ తరహాలోనే ఉండే అవకాశం ఉంది.
ఇందులో సభ్యులు తమ సౌకర్యానికి అనుగుణంగా రోజువారీ, నెలవారీ లేదా వార్షికంగా విరాళాలు చెల్లించుకునే వెసులుబాటు ఉండొచ్చు.
ఇలా జమయ్యే మొత్తంపై ప్రతి ఏడాది వడ్డీ కూడా లభించే అవకాశం ఉందని పేర్కొంది.
అంతేకాకుండా, ప్రస్తుతం ఈపీఎఫ్‌కు ఉన్నట్లే ఈ కొత్త పథకంలో కూడా పన్ను రాయితీలు ఉండే అవకాశముందని నివేదిక తెలిపింది.
ఏడాదికి రూ.2.5 లక్షల వరకు చేసే చెల్లింపులు, వాటిపై వచ్చే వడ్డీకి కూడా పన్ను మినహాయింపు వర్తించే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే, ఈ అంశాలపై ఇప్పటివరకు అధికారిక నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు.
వివరాలు
సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్..
ఇక నిధుల ఉపసంహరణ విధానంలో కూడా ఈపీఎఫ్‌వో మార్పులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పదవీ విరమణ తర్వాత మొత్తం నిధిని ఒకేసారి తీసుకోవాల్సి ఉండగా, ప్రతిపాదిత విధానంలో సభ్యులు తమ పొదుపును ఈపీఎఫ్‌వో వద్దే కొనసాగించి, అవసరానికి అనుగుణంగా దశలవారీగా ఉపసంహరించుకునే అవకాశం కల్పించేలా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) తరహా విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
దీంతో రిటైర్డ్ ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఎంత మొత్తం, ఎప్పుడు తీసుకోవాలన్నది స్వయంగా నిర్ణయించుకునే అవకాశం ఉండొచ్చు.
ఈ సదుపాయాన్ని ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాలు కలిగిన సభ్యులకు కూడా విస్తరించే అంశాన్ని ఈపీఎఫ్‌వో పరిశీలిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
వివరాలు
చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం..
వ్యవస్థీకృత రంగ ఉద్యోగులతో మాత్రమే పరిమితం కాకుండా సామాజిక భద్రతను మరింత విస్తరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
సోషల్ సెక్యూరిటీ కోడ్-2020 ప్రకారం గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు తదితర అర్హుల కోసం సామాజిక భద్రతా పథకాలు రూపొందించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పించింది.
అయితే, ఇప్పటివరకు యూనివర్సల్ ఈపీఎఫ్ పథకాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం ఇంకా రాకపోయినా, ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ఐటీ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి కోసం ఈపీఎఫ్‌వో ఇప్పటికే టెండర్‌ను ఆహ్వానించినట్లు పేర్కొంది.