RBI: బ్యాంకింగ్ ఫిర్యాదులపై ఫాస్ట్ ట్రాక్ పరిష్కారం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంకింగ్ సేవల్లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సమర్థంగా, వేగవంతంగా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులతో పాటు ఇతర నియంత్రిత సంస్థల ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడాలనే లక్ష్యంతో 'రిజర్వ్ బ్యాంక్-సమగ్ర అంబుడ్స్‌మన్ పథకం-2026'ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ దిశగా 'రిజర్వ్ బ్యాంక్-అంబుడ్స్‌మన్ స్కీం 2025'కు కొన్ని సవరణలతో ముసాయిదాను శుక్రవారం ఆర్ బి ఐ విడుదల చేసింది. ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను కోరుతూ, అవి అందిన అనంతరం వాటిని క్రోడీకరించి తుది నిబంధనలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త పథకం 2026 జులై 1 నుంచి అమల్లోకి రానుంది.
Details
సాధారణ సాక్ష్యాధారాల నిబంధనలకు లోబడి ఉండవు
ఫిర్యాదిదారులకు తక్కువ ఖర్చుతో, వేగంగా న్యాయం అందించడమే ఈ పథకంలోని ప్రధాన లక్ష్యమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. విచారణ ప్రక్రియలు క్లుప్తంగా ఉంటాయని, ఇవి సాధారణ సాక్ష్యాధారాల నిబంధనలకు లోబడి ఉండవని పేర్కొంది. ఈ బాధ్యతలను నిర్వహించేందుకు ఆర్‌బీఐ తన అధికారులలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువమందిని ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్, ఆర్‌బీఐ డిప్యూటీ అంబుడ్స్‌మన్‌లుగా నియమించనుంది. వీరి నియామక కాలపరిమితి సాధారణంగా ఒకేసారి మూడేళ్ల వరకు ఉంటుంది. ఫిర్యాదుల స్వీకరణ, పరిశీలన కోసం ఆర్‌బీఐ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చోట్ల సీఆర్‌పీసీ (సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్)లను ఏర్పాటు చేయనుంది.
Details
ఎలాంటి గరిష్ఠ పరిమిత ఉండదు
వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారా సులభంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించనుంది. నూతన విధానంలో వివాదానికి సంబంధించిన మొత్తంపై ఎలాంటి గరిష్ఠ పరిమితి విధించలేదు. అంబుడ్స్‌మన్ లేదా డిప్యూటీ అంబుడ్స్‌మన్ వివాదాలను రాజీ ద్వారా లేదా తగిన తీర్పు (అవార్డు) ఇచ్చి పరిష్కరిస్తారు. ఖాతాదారులకు కలిగిన నష్టానికి సంబంధించి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పరిహారం చెల్లించాలని ఆదేశించే అధికారం అంబుడ్స్‌మన్‌కు ఉంటుంది. దీనికి అదనంగా మరో రూ.3 లక్షల వరకు పరిహారం మంజూరు చేసే అవకాశం కూడా ఉందని ఆర్‌బీఐ వెల్లడించింది.