Loading...
Kalyan Krishnamurthy: ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం.. సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా  
ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం.. సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

Kalyan Krishnamurthy: ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం.. సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. గత 11 ఏళ్లకు పైగా సంస్థలో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం అధికారికంగా వెల్లడించింది.అయితే, ఆయన రాజీనామాకు గల కారణాలను సంస్థ ప్రకటించలేదు. ప్రస్తుతం గ్రూప్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బాలాజీ త్యాగరాజన్‌కు తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు. సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించారు. వారిద్దరూ సంస్థ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత 2017లో కల్యాణ్ కృష్ణమూర్తి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

వివరాలు 

2018లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా నియామకం 

ఆ తర్వాత 2018లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా నియమితులయ్యారు. అప్పటి నుంచి సంస్థ వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా అమెజాన్, మీషో వంటి ప్రత్యర్థి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకునేలా కృషి చేశారు.

యువత, ముఖ్యంగా జెన్‌జీ వినియోగదారులను ఆకర్షించడంపై కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

కొత్త వ్యాపార విభాగాల్లోకి అడుగుపెట్టడంతో పాటు ఫుడ్ డెలివరీ రంగంలోనూ అవకాశాలను అన్వేషించారు.

అలాగే క్విక్ కామర్స్ విభాగంలో బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సేవలను ప్రారంభించడంలో కీలకంగా వ్యవహరించారు.

అయితే,కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా వెనుక అసలు కారణాలపై స్పష్టత లేదు.

వివరాలు 

గత ఏడాది కాలంలో సంస్థను వీడిన వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు

సంస్థలో అంతర్గత సమస్యలు, ప్రతిపాదిత ఐపీఓ ఆలస్యం,మాతృసంస్థ వాల్‌మార్ట్‌తో విభేదాలు ఆయన నిర్ణయానికి కారణమై ఉండొచ్చని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఫ్లిప్‌కార్ట్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడంపై వాల్‌మార్ట్ ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు.

దీంతో కంపెనీ ఐపీఓ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఐపీఓ ఆలస్యం కారణంగా తమ వద్ద ఉన్న కంపెనీ షేర్లను నగదుగా మార్చుకునే అవకాశం లభించడం లేదని కొందరు ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, గత ఏడాది కాలంలో పలువురు వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను వీడారు.

ఇప్పటికే కీలక స్థాయిల్లో ఉద్యోగుల నిష్క్రమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి కూడా రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT