మాంద్యంలోకి జర్మన్ ఆర్థిక వ్యవస్థ; వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గిన జీడీపీ
ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాంద్యంలోకి ప్రవేశించింది. గత మూడు నెలలతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో జర్మనీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 0.3శాతం పడిపోయింది. జర్మనీ జీడీపీ క్షీణించడం ఇది వరుసగా రెండో త్రైమాసికం కావడం గమనార్హం. వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ క్షీణిస్తే అది మాంద్యంగా పరిగణించబడుతుంది. ఐరోపాలో గత ఏడాది కాలంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. అలాగే స్థిరంగా ద్రవ్యోల్బణం పెరగడం, కఠినమైన ఆర్థిక పరిస్థితులు జీడీపీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే జర్మన్ వినియోగదారులు ఆహారం, పానీయం, దుస్తులపై తక్కువ ఖర్చు చేశారు. ప్రభుత్వ వ్యయం గణనీయంగా 4.9శాతం తగ్గింది.
జర్మనీ ఆర్థిక వ్యవస్థపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్
ద్రవ్యోల్బణం జర్మనీకి ప్రధాన శత్రువుగా పరిణమించింది. రష్యా నుంచి ఇంధనం సరఫరా తగ్గిపోవడమే జర్మనీలో ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం. పెరుగుతున్న ధరలను తట్టుకోలేక దేశం నానా తంటాలు పడుతోంది. ఫలితంగా, గృహ వినియోగం ఈ త్రైమాసికంలో 1.2% తగ్గింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత యూరప్ అంతటా ధరలు పెరుగుతున్నాయి. ఆహారం, విద్యుత్ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రష్యా ఇంధన దిగుమతులపై జర్మనీ ఎక్కువగా ఆధారపడటం వల్ల నేడు ఆ దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.