Gold,silver ETF: ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు.. 2% వరకు పడిపోయిన గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారం,వెండి పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయి. సోమవారం గోల్డ్,సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)లో భారీగా అమ్మకాలు జరిగాయి. దీంతో పలు గోల్డ్,సిల్వర్ ఈటీఎఫ్‌లు 2 శాతం వరకు నష్టపోయాయి. అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు బలంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. ఈ వారం చివర్లో వెలువడనున్న కీలక అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. వీటి ఆధారంగా ఫెడ్ తదుపరి వడ్డీ రేట్ల నిర్ణయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ 1.7 శాతం పడిపోగా, ఎస్‌బీఐ గోల్డ్ ఈటీఎఫ్ 1.72 శాతం క్షీణించింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,400 డాలర్లు
నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఈఎస్ 1.6 శాతం, టాటా గోల్డ్ ఈటీఎఫ్ 1.54 శాతం నష్టపోయాయి.
సిల్వర్ ఈటీఎఫ్‌లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ 1.56 శాతం, టాటా సిల్వర్ ఈటీఎఫ్ 1.55 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ 1.45 శాతం చొప్పున పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,400 డాలర్ల దిగువకు చేరి దాదాపు 1 శాతం వరకు తగ్గింది.
అంతకుముందు సెషన్‌లోనూ బంగారం ఇదే స్థాయిలో నష్టపోయింది.
ఆగస్టులో అమెరికా వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాల సంఖ్య భారీగా పెరగడంతోపాటు నిరుద్యోగిత రేటు కూడా స్థిరంగా కొనసాగినట్లు గణాంకాలు వెల్లడించాయి.
వివరాలు
వడ్డీరేట్లు పెరిగితే బంగారంపై ఒత్తిడి పెరుగుతుంది
దీంతో సెప్టెంబర్ 15-16తేదీల్లో జరిగే సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు పెరిగాయి.
వడ్డీ రేట్ల పెంపుపై ట్రేడర్లు కూడా తమ అంచనాలను మార్చుకున్నారు.
సెప్టెంబర్‌లోనే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం దాదాపు 60శాతం ఉందని మార్కెట్ అంచనా వేస్తోంది.
సాధారణంగా వడ్డీరేట్లు పెరిగితే బంగారంపై ఒత్తిడి పెరుగుతుంది.
ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీ ఆదాయాన్ని ఇవ్వదు.దీంతో వడ్డీ వచ్చే పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.
మరోవైపు ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెంచే పరిణామం చోటుచేసుకుంది.
వారాంతంలో అమెరికా నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిలో మూడు చమురు ట్యాంకర్లను,అమెరికాతో సంబంధం ఉన్న మరికొన్ని నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది.