Adecco India: టెక్ రంగానికి శుభవార్త.. 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ టెక్ రంగంలో నియామకాలు మళ్లీ ఊపందుకోనున్నాయని వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా అంచనా వేసింది. ఈ ఏడాది టెక్ నియామకాలు గతేడాదితో పోలిస్తే 12-15శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. శాశ్వత, తాత్కాలిక, ఒప్పంద ప్రాతిపదికన జరగనున్న ఈ నియామకాల ద్వారా దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపింది. గతంలో డిజిటల్ సేవలను కేవలం అదనపు అంశాలుగా చూసిన నాన్-టెక్ పరిశ్రమలు ఇప్పుడు తమ వ్యాపార నమూనాల్లో కీలక మార్పులు చేపడుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాలను ప్రధాన భాగాలుగా చేర్చుకుంటున్నాయి. ఈ పరిణామాలతో 2026 సంవత్సరం టెక్ నియామకాలకు కీలక మలుపుగా మారనుందని నివేదిక విశ్లేషించింది.
Details
ఆధునికీకరణ వంటి విభాగాల్లో భారీగా డిమాండ్
ఐటీ, ఐటీ అనుబంధ సేవల రంగం 2025 నుంచే స్థిరీకరణ దిశగా అడుగులు వేయడం ప్రారంభించినట్లు నివేదిక పేర్కొంది. 2023-24 మధ్యకాలంలో నెలకొన్న అనిశ్చితి తర్వాత, ఏఐ ఇంజినీరింగ్, క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్లాట్‌ఫామ్స్ ఆధునికీకరణ వంటి విభాగాల్లో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పరిశ్రమలు మెల్లగా పునరుద్ధరణ దిశగా సాగుతున్నాయని, క్యాంపస్ నియామకాలు కూడా మెరుగవుతున్నాయని అడెకో ఇండియా డైరెక్టర్, బిజినెస్ హెడ్ సంకేత్ చెంగప్ప తెలిపారు. కంపెనీలు తిరిగి కొత్త ఉద్యోగులను నియమించేందుకు అవసరమైన కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Details
అవసరంగా మారిన ఏఐ, సైబర్ సెక్యూరిటీ
ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతలు ప్రయోగాత్మక దశల నుంచి సంస్థల ప్రధాన అవసరాలుగా మారినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ విభాగాల్లో డిమాండ్ ఏకంగా 51 శాతం పెరిగిందని వెల్లడించింది. ఇప్పటికే సుమారు 40 శాతం పెద్ద సంస్థలు ప్రయోగాత్మక జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకువచ్చాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) సైబర్ సెక్యూరిటీకి బోర్డు స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుండగా, టెక్ తేర రంగాలు ఆటోమేషన్ వేగవంతం చేసేందుకు పెద్దఎత్తున టెక్ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
Details
నిపుణుల కొరత.. పెరిగిన వేతనాలు
ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ, పరిశ్రమకు అవసరమైన నిపుణుల కొరత సవాలుగా మారింది. 2025 నాటికి నైపుణ్య లోటు 44 శాతానికి చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది. దీనివల్ల నైపుణ్యం ఉన్న అభ్యర్థుల కోసం పోటీ పెరిగి, వేతన ప్యాకేజీలు 2024తో పోలిస్తే సగటున 18 శాతం అధికంగా లభిస్తున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ వంటి విభాగాలు సుమారు 45 శాతం నైపుణ్య లోటును ఎదుర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో డిజిటల్ పరివర్తన వేగం, నిపుణుల లభ్యతపైనే ఆధారపడి ఉంటుందని చెంగప్ప అభిప్రాయపడ్డారు.
Details
కీలక రంగాలు
ప్రస్తుతం టెక్ ఆధారిత నియామకాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), ఆరోగ్య సంరక్షణ, తయారీ, లాజిస్టిక్స్ రంగాలు ముందువరుసలో ఉన్నాయని అడెకో ఇండియా నివేదిక తెలిపింది. మొత్తం టెక్ ఉద్యోగాల్లో ఈ రంగాల వాటా దాదాపు 38 శాతంగా ఉందని స్పష్టం చేసింది.