Google: గూగుల్‌కు భారీ జరిమానా.. లొకేషన్ డేటా వ్యవహారంలో రూ.3,700 కోట్ల ఫైన్!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం గూగుల్‌కు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) భారీ జరిమానా విధించింది. యూజర్ల లొకేషన్ డేటాను ప్రాసెస్ చేసిన విధానంలో యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో 403 మిలియన్ యూరోలు (సుమారు రూ.3,700 కోట్లు) ఫైన్ వేసింది. ఈ నిర్ణయాన్ని 2026 సెప్టెంబర్ 21న డీపీసీ ప్రకటించింది. ఏం జరిగింది? 2018 మే 25 నుంచి 2020 ఫిబ్రవరి 4 వరకు గూగుల్ యూజర్ల లొకేషన్ డేటాను ప్రాసెస్ చేసిన విధానంపై డీపీసీ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో డేటా వినియోగానికి సంబంధించిన చట్టబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాల్లో గూగుల్ GDPR నిబంధనలను పాటించలేదని కమిషన్ తేల్చింది.
వివరాలు
మూడు ఫీచర్లపై దర్యాప్తు
గూగుల్ 'వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ', 'లొకేషన్ హిస్టరీ', 'లొకేషన్ అక్యురసీ' అనే మూడు ఫీచర్ల ద్వారా లొకేషన్ సమాచారాన్ని ప్రాసెస్ చేసిన తీరాన్ని డీపీసీ పరిశీలించింది.
'వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ' ద్వారా గూగుల్ సేవలు, వెబ్‌సైట్లు, యాప్‌లలో యూజర్ల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం, సెర్చ్ హిస్టరీ, బ్రౌజింగ్ హిస్టరీతో పాటు లొకేషన్ డేటాను కూడా ప్రాసెస్ చేయవచ్చు.
అదే సమయంలో 'లొకేషన్ హిస్టరీ' ఫీచర్ యూజర్లు వెళ్లిన ప్రాంతాలు, వారి కార్యకలాపాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన మార్గాల వంటి సమాచారాన్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.
ఆండ్రాయిడ్‌లోని 'లొకేషన్ అక్యురసీ' ఫీచర్ GPSతో పాటు ఇతర సమాచారాన్ని ఉపయోగించి డివైస్ లొకేషన్‌ను మరింత ఖచ్చితంగా గుర్తించేందుకు పనిచేస్తుంది.
వివరాలు
యూజర్లకు పూర్తి సమాచారం ఇవ్వలేదని..
ఈ ఫీచర్ల ద్వారా లొకేషన్ డేటాను ఎలా ఉపయోగిస్తున్నారనే విషయాన్ని వినియోగదారులకు తగినంత స్పష్టంగా తెలియజేయలేదని డీపీసీ పేర్కొంది.
ముఖ్యంగా లొకేషన్ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని యూజర్ల ఆసక్తులను అంచనా వేయడం లేదా ప్రకటనలను ప్రభావితం చేయడం వంటి ప్రయోజనాలకు డేటా ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ, దాని గురించి వినియోగదారులకు తగిన అవగాహన కల్పించలేదని తెలిపింది.
దీంతో తమ వ్యక్తిగత సమాచారంపై యూజర్ల నియంత్రణ తగ్గే అవకాశం ఉందని డీపీసీ అభిప్రాయపడింది.
వివరాలు
అవసరానికి మించి డేటా నిల్వ
లొకేషన్ డేటాను అవసరమైన దానికంటే ఎక్కువ కాలం నిల్వ చేయడంపైనా డీపీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ముఖ్యంగా 'వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ', 'లొకేషన్ హిస్టరీ'కి సంబంధించిన డేటా నిల్వ విషయంలో GDPRలోని స్టోరేజ్ లిమిటేషన్ సూత్రాలను గూగుల్ పాటించలేదని కమిషన్ తేల్చింది.
ఆరు నెలల్లో మార్పులు చేయాలి
రూ.3,700 కోట్ల జరిమానాతో పాటు మరో కీలక ఆదేశాన్ని కూడా డీపీసీ జారీ చేసింది.
తమ లొకేషన్ డేటా ప్రాసెసింగ్ విధానాలను ఆరు నెలల్లోగా GDPR నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా మార్చుకోవాలని గూగుల్‌ను ఆదేశించింది.
డీపీసీ ఇప్పటివరకు విధించిన జరిమానాల్లో ఇది నాలుగో అతిపెద్దదిగా నిలిచింది.
వివరాలు
మూడు కేసులు ఇంకా దర్యాప్తులో..
గూగుల్‌కు సంబంధించిన మరో మూడు ప్రైవసీ ఉల్లంఘనల దర్యాప్తులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ వెల్లడించింది.
ఈ కేసులో పూర్తి నిర్ణయ పత్రాన్ని కూడా తరువాత విడుదల చేయనున్నట్లు తెలిపింది.
2020లో ఫిర్యాదులతో ప్రారంభమైన దర్యాప్తు
యూరోపియన్ కన్జ్యూమర్ రైట్స్ సంస్థలు, BEUC సహా పలు వినియోగదారుల హక్కుల సంస్థలు 2020లో చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో డీపీసీ ఈ దర్యాప్తును ప్రారంభించింది.
గూగుల్ యూరోపియన్ ప్రధాన కార్యాలయం ఐర్లాండ్‌లో ఉండటంతో GDPR కింద ఈ సంస్థకు సంబంధించిన ప్రధాన పర్యవేక్షణ సంస్థగా ఐర్లాండ్ DPC వ్యవహరించింది.
వివరాలు
గూగుల్ ఏమంటోంది?
ఈ నిర్ణయంపై గూగుల్ స్పందించింది. డీపీసీ చర్యలు గతంలో అనుసరించిన విధానాలకు సంబంధించినవని తెలిపింది.
2019 నుంచే లొకేషన్ డేటా నిర్వహణలో గణనీయమైన మార్పులు చేసినట్లు పేర్కొంది.
యూజర్లకు మరింత నియంత్రణ కల్పించడం, డేటాను ఆటోమేటిక్‌గా తొలగించే విధానాలు, తక్కువ ఖచ్చితత్వం ఉన్న లొకేషన్ సమాచారాన్ని నిల్వ చేయడం వంటి మార్పులు ఇప్పటికే చేపట్టినట్లు గూగుల్ వెల్లడించింది.