Jaguar Car: వర్షపు నీటితో లగ్జరీ కారు డ్యామేజ్.. క్లెయిమ్ తిరస్కరించిన బీమా సంస్థకు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
వర్షపు నీటితో దెబ్బతిన్న లగ్జరీ కారు విషయంలో బీమా సంస్థ,పాలసీదారుడి మధ్య వివాదం ఏర్పడింది. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కారు యజమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆగస్టు 24న ఇచ్చిన ఆదేశాల్లో బీమా సంస్థ రూ.1.75లక్షలను క్లెయిమ్ మొత్తంగా చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు మానసిక వేదనకు రూ.20వేలు,న్యాయపరమైన ఖర్చులకు రూ.7వేలు ఇవ్వాలని చెప్పింది. మొత్తం పరిహారం రూ.2.02లక్షలకు చేరింది. ఈ కేసులోని వివరాల ప్రకారం.. జాగ్వార్ కారుకు 2020 నవంబర్ 29 నుంచి 2021 నవంబర్ 28వరకు ప్రైవేటు కార్ ఇన్సూరెన్స్ పాలసీ అమల్లో ఉంది. 2021 ఆగస్టులో కారు డ్రైవర్ వైపు ఉన్న కిటికీ కొద్దిగా తెరిచి ఉండటంతో వర్షపు నీరు లోపలికి చేరింది.
వివరాలు
కిటికీ తెరిచి ఉంచడమే కారణమంటూ బీమా క్లెయిమ్ నిరాకరణ
దీంతో కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు మరికొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో కారు యజమాని బీమా క్లెయిమ్ చేశాడు.
బీమా సంస్థ నియమించిన సర్వేయర్ నష్టాన్ని రూ.1.98 లక్షలుగా అంచనా వేశాడు.
అయితే కారు మరమ్మతులకు తాను రూ.2.73 లక్షలు ఖర్చు చేసినట్లు యజమాని తెలిపాడు.
అనంతరం 2022 ఫిబ్రవరి 4న బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించింది. వర్షపు నీటి వల్ల జరిగిన నష్టానికి పాలసీలో కవరేజీ లేదని పేర్కొంది.
అంతేకాకుండా కారు కిటికీ తెరిచి ఉంచడం యజమాని నిర్లక్ష్యమని, ఇది బీమా ఒప్పందంలోని నిబంధనలకు విరుద్ధమని తెలిపింది.
దీంతో అసంతృప్తి చెందిన కారు యజమాని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
వివరాలు
పాలసీలో లేని నిబంధనలతో క్లెయిమ్ తిరస్కరణ చెల్లదు
బీమా సంస్థ సేవల్లో లోపం చూపిందని, అన్యాయమైన వ్యాపార పద్ధతికి పాల్పడిందని ఫిర్యాదు చేశాడు.
కారు బీమా తీసుకునే సమయంలో పూర్తి పాలసీ నిబంధనలు, షరతులను తనకు ఇవ్వలేదని వాదించాడు.
అలాంటప్పుడు తర్వాత పాలసీలోని మినహాయింపు నిబంధనలను చూపించి క్లెయిమ్‌ను తిరస్కరించడం సరికాదని పేర్కొన్నాడు.
ఈ వాదనను పరిశీలించిన కమిషన్.. కారు యజమానికి అందించిన పాలసీ పత్రాలు నాలుగు పేజీలుగా ఉండగా, బీమా సంస్థ తర్వాత ఆరు పేజీల నిబంధనలు, షరతులను సమర్పించినట్లు గుర్తించింది.
మొదట ఇచ్చిన పాలసీలో లేని అదనపు నిబంధనలను ఆధారంగా చేసుకుని క్లెయిమ్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది.
వివరాలు
పాలసీదారుడికి తెలియని నిబంధనలపై కమిషన్ కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా బీమా సంస్థ నాలుగు పేజీల్లో మూడు పేజీలను మాత్రమే సమర్పించిందని, క్లెయిమ్‌ను తిరస్కరించేందుకు చూపిన మినహాయింపు నిబంధనలు కారు యజమానికి అందలేదని కమిషన్ గుర్తించింది.
పాలసీదారుడికి ముందుగానే వెల్లడించని మినహాయింపు నిబంధనలు అతనిపై వర్తించవని కమిషన్ తేల్చింది.
అలాంటి నిబంధనలను చూపిస్తూ బీమా క్లెయిమ్‌ను తిరస్కరించడం సమర్థనీయం కాదని పేర్కొంది.
ఇది సేవల్లో లోపం, అన్యాయమైన వ్యాపార పద్ధతిగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది.
వివరాలు
పాలసీ నిబంధనలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?
పూర్తి పాలసీ నిబంధనలు, షరతులు, మినహాయింపుల వివరాలను బీమా సంస్థ పాలసీదారుడికి అందించకపోతే, వాటిని ఆధారంగా చేసుకుని క్లెయిమ్‌ను తిరస్కరించలేమని కమిషన్ తన తీర్పులో పేర్కొంది.
ఈ కేసు బీమా తీసుకునే వారికి కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది.
పాలసీ కొనుగోలు చేసే సమయంలో పూర్తి పత్రాలు, షెడ్యూల్, ఎండార్స్‌మెంట్లు, మినహాయింపు నిబంధనలను తప్పనిసరిగా చదివి భద్రపరచుకోవాలి.
భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తితే ఈ పత్రాలు వినియోగదారుల కమిషన్ ముందు ఆధారాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.