
Google layoffs: క్లౌడ్ విభాగంలో 100 మంది ఉద్యోగులపై గూగుల్ వేటు..!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది. ముఖ్యంగా క్లౌడ్ విభాగంలోని డిజైన్ సంబంధిత పనుల్లో ఉన్న సుమారు 100 మందిని ఈ వారం ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సీఎన్‌బీసీ నివేదించింది. తొలగింపులలో ఎక్కువగా క్వాంటిటేటివ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ టీమ్, ప్లాట్‌ఫామ్ అండ్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ బృందంలో పనిచేసే సిబ్బందే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగులు వినియోగదారుల ప్రవర్తన, వారి అవసరాలను డేటా,సర్వేలు,పరిశోధనల ఆధారంగా అంచనా వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారు అందించే సమాచారం ఆధారంగానే గూగుల్ కొత్త ఉత్పత్తులు, డిజైన్లను అభివృద్ధి చేస్తుంది. ఇదే సమయంలో,కొన్ని క్లౌడ్ డిజైన్ టీమ్‌లను దాదాపు సగానికి కుదించినట్లు సమాచారం.
వివరాలు
ఉద్యోగులు మేనేజ్‌మెంట్‌ను పని వాతావరణంపై ప్రశ్నించినందువల్లే ఈ చర్యలు
తాజాగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా అమెరికా సిబ్బందే కాగా, మిగిలిన వారిని కంపెనీ ఇతర విభాగాల్లో ప్రత్యామ్నాయ పోస్టుల్లో నియమించింది. ఈ చర్యలు, కృత్రిమ మేధ రంగంలో గట్టి పోటీని ఎదుర్కొనేందుకు గూగుల్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉన్నాయని భావిస్తున్నారు. గత నెలలో కూడా జెమినీ మరియు ఏఐ ఓవర్‌వ్యూ విభాగాల్లో పనిచేసే 200 మందికి పైగా కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించింది. ఈ తొలగింపుల వల్ల ఉద్యోగ భద్రత లేకపోవడం, వేతనాల విషయంలో అస్థిరత ఉండటం వంటి కారణాలతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిందని వైర్డ్ కథనంలో పేర్కొంది. కొందరు ఉద్యోగులు మేనేజ్‌మెంట్‌ను పని వాతావరణంపై ప్రశ్నించినందువల్లే ఈ చర్యలు తీసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
వివరాలు
గ్లోబల్ బిజినెస్, ప్లాట్‌ఫార్మ్స్, డివైజెస్ విభాగాల్లో కూడా సిబ్బంది తగ్గింపు
ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే క్లౌడ్ విభాగంలో గణనీయమైన సిబ్బందిని తగ్గించింది. వ్యాపారానికి అత్యవసరమైన విభాగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆ సమయంలో గూగుల్ ప్రకటించింది. అదేవిధంగా గ్లోబల్ బిజినెస్, ప్లాట్‌ఫార్మ్స్, డివైజెస్ విభాగాల్లో కూడా సిబ్బందిని తగ్గించింది. అంతేకాకుండా 2025 ప్రారంభంలో మానవ వనరులు, హార్డ్‌వేర్, సెర్చ్, యాడ్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, కామర్స్ విభాగాల సిబ్బందికి వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించింది.
వివరాలు
మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌పై దృష్టి
ఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా గూగుల్ మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మొత్తం మూడవ వంతు మధ్యస్థాయి మేనేజర్లను తొలగించింది. ముఖ్యంగా చిన్న టీమ్‌లను పర్యవేక్షించే మేనేజర్లను ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం. నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, పనులను సమర్థవంతంగా ఒకే దారిలో నడిపించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. 2024 డిసెంబర్ నాటికి వరుస లేఆఫ్‌ల తర్వాత కూడా గూగుల్‌లో సుమారు 1,83,323 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని సమాచారం.