Google Shares: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్ల పతనం.. రూ.26 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు భారీగా పడిపోయాయి. అమెరికా మార్కెట్లలో బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే కంపెనీ షేర్లు 11 శాతం వరకు క్షీణించాయి. కృత్రిమ మేధ (ఏఐ) సేవలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. వాటిపై చేస్తున్న భారీ పెట్టుబడులు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు ఆశించిన స్థాయిలో లాభాలను అందించడం లేదన్న ఆందోళనలు మదుపర్లలో నెలకొన్నాయి. దీనికి తోడు కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వాల్‌స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోవడంతో షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఆల్ఫాబెట్ మార్కెట్ విలువలో 280 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.26 లక్షల కోట్లు.
వివరాలు
30.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసిన గూగుల్ క్లౌడ్
మూడో త్రైమాసికంలో ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ క్లౌడ్ విభాగం 30.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
మరోవైపు గూగుల్ సెర్చ్, యూట్యూబ్ విభాగాల ఆదాయ వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోయినా.. క్లౌడ్ విభాగం నుంచి వచ్చిన ఆదాయం ఆ లోటును కొంతవరకు భర్తీ చేసింది.
అయినప్పటికీ కంపెనీ ప్రకటించిన ఫలితాలు పెట్టుబడిదారులను సంతృప్తిపరచలేకపోయాయి.
కంపెనీ మొత్తం ఆదాయంలో వృద్ధి నమోదైనప్పటికీ.. నికర లాభాలు, ఒక్కో షేరుపై వచ్చే లాభం (ఈపీఎస్) మాత్రం మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి.
వివరాలు
ఆల్ఫాబెట్ షేర్లపై ఒత్తిడి
ఏఐ సాంకేతికత, క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఆల్ఫాబెట్ భారీగా ఖర్చు చేస్తోంది.
ఈ పెట్టుబడుల కారణంగా కంపెనీ వద్ద అందుబాటులో ఉండే నగదు తగ్గుతుండటం మదుపర్లలో ఆందోళనకు దారితీస్తోంది.
ఏఐ, క్లౌడ్ రంగాల్లో ప్రస్తుతం చేస్తున్న భారీ పెట్టుబడులకు అనుగుణంగా సమీప భవిష్యత్తులో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయా? అనే సందేహాలు పెట్టుబడిదారుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ అనిశ్చితి, అంచనాలకు తగ్గట్టుగా లాభాలు లేకపోవడం కలిసి ఆల్ఫాబెట్ షేర్లపై ఒత్తిడిని పెంచాయి. దీంతో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి.