Sugar stock limit: షుగర్ వ్యాపారులకు కేంద్రం షాక్.. నిల్వలపై కొత్త నిబంధనలు అమల్లోకి..
ఈ వార్తాకథనం ఏంటి
పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ చక్కెర ధరలు,సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో చక్కెర నిల్వలు అధికంగా పేరుకుపోకుండా, హోర్డింగ్, ఊహాజనిత వ్యాపారం, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించే లక్ష్యంతో డీలర్ల స్టాక్ హోల్డింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు అమల్లో ఉంటాయి. తాజా నిబంధనల ప్రకారం దేశంలోని సాధారణ ప్రాంతాల్లో చక్కెర డీలర్లు ఒకేసారి గరిష్ఠంగా 1,000 క్వింటాళ్ల వరకు మాత్రమే స్టాక్ ఉంచుకోవాలి. అంతేకాకుండా డీలర్‌కు చక్కెర నిల్వ వచ్చిన తేదీ నుంచి 15 రోజులకు మించి దాన్ని నిల్వ చేయడానికి అనుమతి ఉండదు. నిర్దేశించిన గడువులోగా ఆ స్టాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయాల్సి ఉంటుంది.
వివరాలు
కోల్‌కతా, అస్సాంకు ప్రత్యేక మినహాయింపు
అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేంద్రం అధిక స్టాక్ పరిమితిని నిర్ణయించింది.
కోల్‌కతా, దాని విస్తరించిన మెట్రోపాలిటన్ ప్రాంతాలు, అస్సాంలోని డీలర్లు ఒకేసారి గరిష్ఠంగా 2,000 క్వింటాళ్ల వరకు చక్కెర నిల్వ చేసుకోవచ్చు.
ఈ ప్రాంతాల్లో మార్కెట్ అవసరాలు, రవాణాకు సంబంధించిన సవాళ్లు, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రత్యేక పరిమితిని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పండుగల సమయంలో చక్కెరకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున సరఫరా వ్యవస్థలో అనవసరంగా పెద్ద మొత్తంలో నిల్వలు పేరుకుపోకుండా చూడటమే తాజా చర్యల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
మిల్లుల నుంచి డీలర్లకు, అక్కడి నుంచి వినియోగదారులకు చక్కెర నిరంతరాయంగా చేరేలా సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
వివరాలు
చక్కెర ధరల్లో తగ్గుదల
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టులో గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత చక్కెర సగటు రిటైల్ ధర సుమారు 15 శాతం తగ్గింది.
ఇదే సమయంలో ఎక్స్-మిల్ ధరలు దాదాపు 28 శాతం తగ్గాయి.
గత మూడు వారాలుగా ఎక్స్-మిల్ ధరల్లో పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ధరలు తగ్గిన ప్రయోజనం వినియోగదారులకు కూడా అందేలా టోకు, చిల్లర వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
వివరాలు
కొత్త షుగర్ సీజన్ ప్రారంభం
కొత్త చక్కెర సీజన్ అక్టోబర్ 1న ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో చెరకు లభ్యత, పంట పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని షుగర్ మిల్లులు క్రషింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది.
చక్కెర ఉత్పత్తి, సరఫరా సజావుగా కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, చక్కెర మిల్లులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కేంద్రం కోరింది.
పండుగల సమయంలో డిమాండ్ పెరిగినా మార్కెట్‌లో కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
వివరాలు
వర్షపాతం, చెరకు దిగుబడులపై నిఘా
దేశంలోని కొన్ని ప్రధాన చక్కెర ఉత్పత్తి ప్రాంతాల్లో తక్కువగా లేదా అస్థిరంగా నమోదవుతున్న వర్షపాతం ప్రభావాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.
వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, చెరకు దిగుబడులు భవిష్యత్‌లో చక్కెర లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వినియోగదారులు, చెరకు రైతులు, చక్కెర పరిశ్రమ ప్రయోజనాల మధ్య సమతుల్యతను కొనసాగిస్తూ మార్కెట్‌లో తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.