PSU bank stake sale: నాలుగు బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా విక్రయం.. ఆర్థిక శాఖ నిర్ణయంపై ఆసక్తి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ రంగానికి చెందిన నాలుగు బ్యాంకుల్లో తన వాటాను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సెబీ నిబంధనల ప్రకారం ఈ బ్యాంకుల్లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను కనీసం 25 శాతానికి పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,యుకో బ్యాంక్,పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి భారీ వాటా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 92.44 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 93.85 శాతం, యుకో బ్యాంకులో 90.95 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 81.19 శాతం వాటా ప్రభుత్వ అధీనంలో ఉంది.
వివరాలు
25 శాతం వాటా ప్రజల చేతుల్లో..
మార్కెట్లో లిస్టయిన ప్రతి కంపెనీలో కనీసం 25 శాతం వాటా ప్రజల చేతుల్లో ఉండాలన్న సెబీ నిబంధనను అమలు చేయడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపడుతోంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. రాబోయే ఏడాది కాలంలో ఈ నాలుగు బ్యాంకుల్లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇందుకోసం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ),ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గాల్లో వాటాలను విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోంది.
అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో షేర్లను విక్రయించడం కష్టమని బ్యాంకులు భావిస్తున్నాయి.
అందుకే,వాటాల విక్రయానికి నిర్దేశించిన గడువును మరో ఏడాది పొడిగించాలని ఆర్థిక శాఖను కోరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గడువు పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
వివరాలు
వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం
మరోవైపు, ప్రభుత్వ వాటా తగ్గింపు ప్రక్రియను ఈ బ్యాంకుల ప్రైవేటీకరణగా భావించకూడదని స్పష్టమవుతోంది.
సెబీ నిర్దేశించిన పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనలను పాటించడమే ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశం.
వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు, సాధారణ ఇన్వెస్టర్లు ఈ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
అయితే షేర్ల విక్రయానికి సంబంధించిన విధివిధానాలు, వాటాలను విక్రయించే సమయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.