LOADING...
RBI: బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీకి గ్రీన్ సిగ్నల్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు
బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీకి గ్రీన్ సిగ్నల్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు

RBI: బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీకి గ్రీన్ సిగ్నల్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకుల కస్టమర్లకు ఉపయోగపడేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో కొత్త మార్పులను తీసుకురానుంది. ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మారడం ప్రస్తుతం క్లిష్టంగా ఉండటంతో, ఈ సమస్యకు పరిష్కారంగా 'పేమెంట్స్ స్విచింగ్ సిస్టమ్' అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆర్బీఐ పని చేస్తోంది. ఇది సెంట్రలైజ్డ్ కేంద్రంగా పనిచేస్తూ, వినియోగదారులు తమ చెల్లింపులను ఒకేచోట నిర్వహించుకోవడానికి, బ్యాంకుల మధ్య సులభంగా మారడానికి సహకరిస్తుంది.

వివరాలు

బ్యాంక్ అకౌంట్ మార్పు ఇక సులువు

ఈ కొత్త వ్యవస్థ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అకౌంట్ నెంబర్ మాత్రం మారదు—బ్యాంక్ మాత్రమే మారుతుంది. మొబైల్ నంబర్‌ను ఒక నెట్‌వర్క్ నుంచి మరొకదానికి పోర్ట్ చేసుకునే విధంగానే, బ్యాంక్ అకౌంట్‌ను కూడా పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో శాలరీ, ఈఎంఐలు, బీమా చెల్లింపులు వంటి సేవలకు అంతరాయం లేకుండా సులభంగా బ్యాంక్ మార్చుకోవచ్చు.

వివరాలు

విదేశీ చెల్లింపుల్లో వేగం

అదేవిధంగా, ఆర్బీఐ 'పేమెంట్స్ విజన్ 2028' పేరుతో కొత్త రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ నగదు బదిలీలను వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. విదేశీ చెల్లింపుల్లో ఉన్న సాంకేతిక అడ్డంకులు, నియంత్రణ సమస్యలను తొలగించే దిశగా ప్రస్తుత వ్యవస్థను సమీక్షిస్తోంది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేస్తూ, వ్యాపారులు, ఎన్నారైలకు మరింత సౌలభ్యం కల్పించనుంది. ముఖ్యంగా విదేశీ లావాదేవీల్లో పారదర్శకత పెంచడం, జాప్యాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోనుంది. మొత్తంగా ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే, బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా, వేగంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement