
IndusInd Bank- Airtel: నష్టాల్లో ట్రేడవుతున్న ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్ సమయంలో గణనీయంగా పడిపోయాయి.
ఈ బ్యాంక్‌లో లెక్కలక్రమంలో అనేక లోపాలు బయటపడటంతో షేర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
ఫలితంగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో షేర్ల ధర 5 శాతం కన్నా ఎక్కువగా పడిపోయింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడు త్రైమాసికాల్లో బ్యాంక్ మొత్తం రూ.674 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సరైన రీతిలో నమోదు చేయకుండా తప్పుగా చేర్చినట్టు తేలింది.
ఈ విషయమై నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో ఈ లోపం బయటపడింది.
అయితే, ఈ లోపాలను బ్యాంక్ ఇప్పటికే 2025 జనవరి 10 నాటికి సరిచేసిందని, స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా స్పష్టం చేసింది.
వివరాలు
నష్టాల్లో ఎయిర్‌టెల్ షేర్లు
అయినప్పటికీ, బ్యాంకులో వరుసగా వెలుగుచూస్తున్న అకౌంటింగ్ లోపాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తూ షేరు ధరలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
శుక్రవారం ఇంట్రాడేలో బీఎస్ఈ మార్కెట్‌లో ఈ షేరు 5.68 శాతం నష్టాన్ని చవిచూసి రూ.735.95 కనిష్ఠ స్థాయిని తాకగా, ఉదయం 11 గంటల సమయంలో రూ.760.15 వద్ద ట్రేడవుతోంది.
దేశీ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ షేర్లు కూడా శుక్రవారం నష్టాల్లో కొనసాగాయి.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్లు సుమారుగా 3 శాతం మేర క్షీణించాయి. సింగపూర్‌కు చెందిన సింగటెల్ సంస్థ తనకు ఉన్న ఎయిర్‌టెల్ షేర్లలో 1.4 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో మార్కెట్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి.
ఈ విక్రయాన్ని బ్లాక్ డీల్ రూపంలో చేయనున్నట్లు సమాచారం.
వివరాలు
నష్టాల్లో ఎయిర్‌టెల్ షేర్లు
ఈ డీల్‌కు ఫ్లోర్ ప్రైజ్‌ను రూ.1800గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం మార్కెట్లో ట్రేడవుతున్న ధర కంటే తక్కువగా ఈ డీల్ జరిగే అవకాశముంది.
అయితే, ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎయిర్‌టెల్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఉదయం 11 గంటల సమయంలో ఎయిర్‌టెల్ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో 2.81 శాతం నష్టంతో రూ.1,814 వద్ద ట్రేడవుతున్నాయి.