Bank Account: బ్యాంకులు మినిమం బ్యాలెన్స్‌ను ఎలా లెక్కిస్తాయంటే...
ఈ వార్తాకథనం ఏంటి
నెల మొదట్లో జీతం పడగానే కొంత డబ్బు ఖర్చులకు తీసుకుంటారు. మరికొంత అవసరాల కోసం వాడతారు. నెలాఖరుకు బ్యాంక్ ఖాతాలో కొద్దిపాటి మొత్తమే మిగులుతుంది. ఇలాంటి సమయంలో బ్యాంకు నుంచి మినిమం బ్యాలెన్స్ ఛార్జీ పడిందనే మెసేజ్ వస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఖాతాలో డబ్బులున్నాయి కదా అనుకుంటాం. కానీ బ్యాంకులు కేవలం నెలాఖరులో ఉన్న మొత్తాన్ని మాత్రమే చూడవు. ఖాతాలోని రోజువారీ నిల్వలను బట్టి కూడా కనీస బ్యాలెన్స్‌ను లెక్కిస్తాయి.
Details
నెలవారీ సగటు నిల్వ అంటే ఏమిటి?
చాలా బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ కోసం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ (MAB) విధానాన్ని అనుసరిస్తాయి.
అంటే నెలలోని ప్రతిరోజూ ఖాతాలో ఉన్న రోజు ముగింపు నిల్వను కలిపి, ఆ నెలలోని రోజుల సంఖ్యతో భాగిస్తారు. ఉదాహరణకు 30 రోజుల నెలలో 15 రోజులు రూ.10,000, మరో 15 రోజులు రూ.2,000 ఉంటే సగటు నిల్వ రూ.6,000 అవుతుంది.
బ్యాంకు నిర్దేశించిన పరిమితి కంటే ఇది తక్కువైతే ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది.
Details
రోజువారీ నిల్వ విధానం కూడా ఉంది
కొన్ని ఖాతాలకు రోజువారీ కనీస నిల్వ నిబంధన ఉండొచ్చు. ఈ విధానంలో ప్రతి రోజూ నిర్దేశించిన కనీస మొత్తం ఖాతాలో ఉండాలి.
ఒక్కరోజు కూడా ఆ పరిమితి తగ్గితే బ్యాంకు నిబంధనల ప్రకారం ఛార్జీలు పడవచ్చు. అయితే అన్ని బ్యాంకులకూ ఒకే నియమం ఉండదు. ఖాతా రకం, నగరం లేదా గ్రామీణ ప్రాంతం, బ్యాంకు విధానాన్ని బట్టి కనీస నిల్వ మారుతుంది.
అందుకే ఖాతా తెరిచేటప్పుడు MABనా, రోజువారీ బ్యాలెన్సా అనేది తెలుసుకోవడం మంచిది.
Details
ప్రతి ఖాతాకూ పెనాల్టీ ఉండదు
జన్‌ధన్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు కనీస నిల్వ అవసరం లేదు.
ఎస్‌బీఐ కూడా సాధారణ సేవింగ్స్ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ జరిమానాలను మార్చి 2020 నుంచే రద్దు చేసింది.
2025లో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ ఛార్జీలను తొలగించాయి. శాలరీ ఖాతాలకూ సాధారణంగా ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.
అయితే ఉద్యోగం మారిన తర్వాత జీతం జమ కాకపోతే కొన్ని బ్యాంకులు ఆ ఖాతాను సాధారణ సేవింగ్స్ ఖాతాగా మార్చవచ్చు.
అప్పుడు కొత్త నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. కాబట్టి మీ ఖాతా రకం, కనీస నిల్వ, ఛార్జీల వివరాలను బ్యాంకు వెబ్‌సైట్ లేదా బ్రాంచ్‌లో తప్పనిసరిగా తెలుసుకోండి.