US Federal Reserve: యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత..నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం
ప్రపంచ మార్కెట్లు, అమెరికా సహా, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈరోజు సంతోషకరమైన వార్తలను అందించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినట్లు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) బుధవారం (18 సెప్టెంబర్ 2024) ప్రకటించింది. వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (0.50% లేదా అరశాతం) తగ్గించడమనే నిర్ణయం తీసుకుంది. ఈ రేట్ల కట్స్ భవిష్యత్తులో కూడా కొనసాగవచ్చు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ కీలక నిర్ణయం తీసుకోబడింది. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు కోసం ప్రపంచ మార్కెట్లు, పెట్టుబడిదారులు నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా, 2020లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది.
4.75 నుంచి 5.00 శాతం మధ్య అమెరికన్ రేట్స్
ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో, వడ్డీ రేట్ల కోతకు అనుకూలంగా 11 ఓట్లు, వ్యతిరేకంగా 1 ఓటు వచ్చాయి. దీంతో, అమెరికాలో వడ్డీ రేట్లు 4.75% నుంచి 5.00% మధ్యలో ఉంటాయని అంచనా. ఇక ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను మరో అరశాతం తగ్గించే సంకేతం ఫెడరల్ రిజర్వ్ ఇచ్చింది. వడ్డీ రేట్లు తగ్గడంతో, అమెరికన్ బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రజలు, వ్యాపారస్తులు, పెట్టుబడిదార్లకు తక్కువ రేట్లపై రుణాలు అందుబాటులోకి వస్తాయి.
3% వరకు తగ్గింపు కొనసాగుతుందని అంచనా
మార్కెట్ నిపుణులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ప్రక్రియ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నారు. ఈ ఏడాది చివరికి మరో అరశాతం, 2025లో ఒక శాతం, 2026లో అరశాతం తగ్గింపుతో, అమెరికాలో వడ్డీ రేట్లు 2.75% నుంచి 3.0% మధ్యలో ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం,నిరుద్యోగంపై ఫెడ్ అంచనాలు అమెరికాలో ద్రవ్యోల్బణం 2% దిశగా పయనిస్తుందని, జాబ్ డేటా మంచి సంకేతాలు ఇస్తుందని ఫెడరల్ రిజర్వ్ తెలిపింది. ఆర్థిక అంచనా ప్రకారం, నిరుద్యోగం రేటు నాలుగో త్రైమాసికంలో 4.4% వరకు ఉండవచ్చని, ద్రవ్యోల్బణం రేటు 2.3% వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
ఫెడ్ రేట్ కట్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా రాబోయే ద్రవ్య విధాన సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. RBI MPC తదుపరి సమావేశం అక్టోబరు 7-9 తేదీల్లో జరుగుతుంది.
భిన్నంగా SBI వాదన
భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం అస్థిరంగా ఉండడం వల్ల, ఈ క్యాలెండర్ సంవత్సరం 2024లో RBI వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. "ఫెడ్ రేట్ల తగ్గింపు చాలా దేశాలను ప్రభావితం చేయవచ్చు. కానీ మన దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చాకే కీలక రేట్ల తగ్గింపుపై RBI నిర్ణయం తీసుకోవచ్చని నా అభిప్రాయం. మా అంచనా ప్రకారం, 2024లో భారత్‌లో వడ్డీ రేట్లు తగ్గవు. 2025 జనవరి - మార్చి కాలం నుంచి కోతలు ప్రారంభం కావచ్చు" అని ఆయన చెప్పారు.