Loading...
Anthropic IPO: క్లాడ్‌ ఏఐ షేర్లు కొనాలనుకుంటున్నారా? భారతీయులకు అందుబాటులో ఉన్న మార్గాలివే..
క్లాడ్‌ ఏఐ షేర్లు కొనాలనుకుంటున్నారా? భారతీయులకు అందుబాటులో ఉన్న మార్గాలివే

Anthropic IPO: క్లాడ్‌ ఏఐ షేర్లు కొనాలనుకుంటున్నారా? భారతీయులకు అందుబాటులో ఉన్న మార్గాలివే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్‌ క్లాడ్‌ను రూపొందించిన ఆంత్రోపిక్‌ కంపెనీ త్వరలో స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. నవంబర్‌ చివరి నాటికి అమెరికాలోని నాస్‌డాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అక్టోబర్‌ 26న ఐపీఓకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ షేర్లు 'ANT' టికర్‌ గుర్తుతో ట్రేడయ్యే అవకాశం ఉంది.ఈ ఐపీఓ నేపథ్యంలో భారతీయ ఇన్వెస్టర్లు కూడా ఆంత్రోపిక్‌ షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐపీఓలో షేర్లు కేటాయిస్తే ఆ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే,ఐపీఓలో షేర్లు దక్కకపోతే ఏం చేయాలి?గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆంత్రోపిక్‌లో పరోక్షంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందా?ఈ విషయాలను తెలుసుకుందాం.

వివరాలు 

అమెరికా ఐపీఓల్లో భారతీయులు పెట్టుబడి పెట్టొచ్చా?

భారతీయులు విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంపై పూర్తిస్థాయి నిషేధం లేదు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)అమలు చేస్తున్న లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)ప్రకారం.. భారత నివాసితులు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 2.5లక్షల అమెరికన్‌ డాలర్ల వరకు విదేశాలకు పంపించవచ్చు.

ఈ నిబంధనల పరిధిలో విదేశీ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

అయితే, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ఇతర నిబంధనలు కూడా వర్తిస్తాయి.

భారత్‌లో ఐపీఓలకు రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి.

కానీ అమెరికా ఐపీఓల్లో భారతీయ రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇలాంటి ప్రత్యేక కోటా లేదు.

ఎన్ని షేర్లను ఎవరికి కేటాయించాలనే నిర్ణయాన్ని ఐపీఓ నిర్వహించే అండర్‌రైటర్లు తీసుకుంటారు.

సాధారణంగా ఎక్కువ షేర్లు సంస్థాగత పెట్టుబడిదారులకే కేటాయిస్తుంటారు.

వివరాలు 

విదేశీ ఐపీఓల్లో పెట్టుబడికి మార్గాలివే..

భారతీయ ఇన్వెస్టర్లు విదేశీ ఐపీఓల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవడం, విదేశీ బ్రోకర్ల ద్వారా పెట్టుబడి పెట్టడం, సంస్థాగత లేదా ప్రైవేటు బ్యాంకింగ్‌ మార్గాలను వినియోగించడం, ఐపీఓకు ముందే పెట్టుబడి పెట్టడం వంటి అవకాశాలు ఉన్నాయని మాడ్యులర్‌ గ్లోబల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, స్మాల్‌కేస్‌ మేనేజర్‌ సంజిత్‌ సింగ్‌ పాల్‌ తెలిపారు.

అయితే, ఈ ప్రక్రియకు అర్హత కలిగిన బ్రోకర్లు లేదా మధ్యవర్తుల సహాయం అవసరమవుతుందని చెప్పారు.

విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా), ఓవర్సీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ నిబంధనలు, ఆర్‌బీఐ మార్గదర్శకాలు, ఎల్‌ఆర్‌ఎస్‌ పరిమితులను పాటించాల్సి ఉంటుందని వివరించారు.

అంతేకాకుండా, కొన్ని దేశాల్లో నేరుగా ఐపీఓలో పాల్గొనే విషయంలో ప్రత్యేక పరిమితులు ఉండొచ్చని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఐపీఓలో షేర్ల కేటాయింపు ఎందుకు కష్టం?

అమెరికా ఐపీఓల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేర్లు దక్కడం అంత సులభం కాదు.

అక్కడి ఐపీఓల్లో చారిత్రకంగా సుమారు 90శాతం షేర్ల కేటాయింపులు సంస్థాగత పెట్టుబడిదారులకే వెళ్లాయని పాల్‌ తెలిపారు.

అయితే, ఈ శాతం ఒక్కో ఐపీఓను బట్టి మారుతుందని చెప్పారు.అందువల్ల భారతీయ రిటైల్‌ ఇన్వెస్టర్లు ఐపీఓ ధరకు షేర్లు పొందడం కష్టమవుతుందని వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన తర్వాత షేర్లను కొనుగోలు చేయడం ఆచరణాత్మకమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

వెస్టెడ్‌ వ్యవస్థాపకుడు,సీఈఓ విరామ్‌ షా మాట్లాడుతూ..అమెరికా ఐపీఓలో పాల్గొనడం భారత్‌లో ఐపీఓకు దరఖాస్తు చేసుకున్నంత సులభం కాదన్నారు.

భారతీయులు నేరుగా అమెరికా ఐపీఓ షేర్లకు దరఖాస్తు చేసుకునేందుకు దేశీయమార్కెట్‌లో ఉన్నట్లుగా ప్రత్యేక కేటాయింపు విధానం లేదని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఐపీఓలో షేర్ల కేటాయింపు ఎందుకు కష్టం?

ఆంత్రోపిక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయిన తర్వాత, అంతర్జాతీయ పెట్టుబడుల సదుపాయం కల్పించే భారతీయ యాప్‌లు లేదా విదేశీ బ్రోకర్ల ద్వారా షేర్లను కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

అప్పుడు ఐపీఓ ధరకు షేర్లు పొందేందుకు ప్రయత్నించకుండా, మార్కెట్‌లో ట్రేడవుతున్న ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

వివరాలు 

ఆల్ఫాబెట్‌ షేర్లతో ఆంత్రోపిక్‌లో పరోక్ష పెట్టుబడి సాధ్యమేనా?

ఆంత్రోపిక్‌లో పెట్టుబడి పెట్టేందుకు మరో మార్గం పరోక్ష పెట్టుబడి.

గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌.. ఆంత్రోపిక్‌కు గరిష్ఠంగా 40 బిలియన్‌ డాలర్ల నిధులు అందించేందుకు హామీ ఇచ్చింది.

ఇందులో తొలుత 10 బిలియన్‌ డాలర్ల నగదు పెట్టుబడి, మిగిలిన 30 బిలియన్‌ డాలర్లను నిర్దిష్ట పనితీరు లక్ష్యాలను ఆంత్రోపిక్‌ చేరుకున్న తర్వాత అందించే ప్రతిపాదన ఉన్నాయి.

ఆల్ఫాబెట్‌ ఇప్పటికే ఆంత్రోపిక్‌లో పెట్టుబడి పెట్టినందున, ఆ సంస్థ షేర్లు కొనుగోలు చేసిన వారికి ఆంత్రోపిక్‌లో పరోక్షంగా కొంత ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉందని విరామ్‌ షా తెలిపారు.

అయితే, ఆల్ఫాబెట్‌ షేర్లు కొనడం, ఆంత్రోపిక్‌ షేర్లను నేరుగా కొనడం రెండూ ఒకటి కాదని గుర్తుంచుకోవాలి.

వివరాలు 

పెట్టుబడికి ముందు ఈ విషయాలు పరిశీలించాలి..

ఆల్ఫాబెట్‌ షేరు ధరపై గూగుల్‌ వ్యాపారం, ప్రకటనల ఆదాయం, క్లౌడ్‌ సేవలు, ఇతర పెట్టుబడులు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.

ఆంత్రోపిక్‌ అందులో ఒక భాగం మాత్రమే. కాబట్టి ఆల్ఫాబెట్‌లో పెట్టుబడి పెట్టినంత మాత్రాన ఆంత్రోపిక్‌ షేర్లలో నేరుగా వాటా ఉన్నట్లు కాదు.

ఒక కంపెనీ బలంగా ఉందని చెప్పి, దాని షేర్లను ఏ ధరకు కొన్నా లాభం వస్తుందని భావించకూడదు.

ఐపీఓ సమయంలో నిర్ణయించే షేరు ధర, కంపెనీ విలువ, ఆర్థిక పరిస్థితి, పోటీ సంస్థలతో పోలిస్తే దాని స్థానం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిశీలించాలి.

ఏఐ ఐపీఓపై మార్కెట్‌లో ఉన్న ఉత్సాహాన్ని మాత్రమే చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోవద్దని విరామ్‌ షా సూచించారు.

వివరాలు 

పెట్టుబడికి ముందు ఈ విషయాలు పరిశీలించాలి..

ఆంత్రోపిక్‌ ఆదాయాన్ని ఎలా సంపాదిస్తోంది? దాని వృద్ధి భవిష్యత్తులో స్థిరమైన లాభాలుగా మారుతుందా? కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాలు, ఏఐ మోడళ్ల అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తోంది? కంపెనీ విలువను నిర్ణయించేటప్పుడు ఈ ఖర్చులు, భవిష్యత్తులో ఎదురయ్యే నష్టభయాలను పరిగణనలోకి తీసుకున్నారా? వంటి అంశాలను విశ్లేషించాలని తెలిపారు.

మొత్తంగా, భారతీయ ఇన్వెస్టర్లు ఆంత్రోపిక్‌ ఐపీఓలో నేరుగా పాల్గొనే అవకాశాలను పరిశీలించవచ్చు.

అయితే, నిబంధనలు, షేర్ల కేటాయింపు విధానం, అందుబాటులో ఉన్న బ్రోకరేజ్‌ సదుపాయాలను ముందుగా తెలుసుకోవాలి.

ఐపీఓలో షేర్లు దక్కకపోతే లిస్టింగ్‌ తర్వాత కొనుగోలు చేయడం లేదా ఆల్ఫాబెట్‌ ద్వారా పరోక్ష పెట్టుబడి పెట్టడం వంటి మార్గాలను పరిశీలించవచ్చు.

ఏ నిర్ణయం తీసుకునే ముందైనా పెట్టుబడి విలువ, నష్టభయాలను అంచనా వేయడం ముఖ్యం.

ADVERTISEMENT