Loading...
TikTok: టిక్‌టాక్‌కు భారీ షాక్‌.. పిల్లల భద్రత కేసులో అమెరికాకు రూ.3,800 కోట్లు!
టిక్‌టాక్‌కు భారీ షాక్‌.. పిల్లల భద్రత కేసులో అమెరికాకు రూ.3,800 కోట్లు!

TikTok: టిక్‌టాక్‌కు భారీ షాక్‌.. పిల్లల భద్రత కేసులో అమెరికాకు రూ.3,800 కోట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసును పరిష్కరించుకునేందుకు ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌ టాక్‌ అమెరికా ప్రభుత్వంతో రాజీకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా న్యాయ విభాగానికి (US Justice Department) 400 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3,800 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో చెల్లించనున్నట్లు వెల్లడించింది. దీంతో 2024లో దాఖలైన కేసు ముగిసింది. పిల్లలు, తల్లిదండ్రులకు టిక్‌టాక్‌ రాజీ ఒక పెద్ద విజయమని అమెరికా అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ స్టాన్లీ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో చిన్నారులకు రక్షణ కల్పించడంతో పాటు, సోషల్‌ మీడియా యాప్‌లు వారి వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచేలా పర్యవేక్షించడం తమ బాధ్యత అని తెలిపారు.

వివరాలు

తల్లిదండ్రుల అనుమతి లేకుండా డేటా సేకరణ ఆరోపణలు

13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ముందు.. చిన్నారుల కోసం ఉద్దేశించిన యాప్‌లు, వెబ్‌సైట్లు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని ఫెడరల్‌ చట్టం నిర్దేశిస్తోంది.

ఈ నిబంధనలను టిక్‌టాక్‌, దాని చైనా ఆధారిత మాతృసంస్థ బైట్‌డాన్స్‌ ఉల్లంఘించాయని ఆరోపిస్తూ అమెరికా న్యాయశాఖ 2024లో వ్యాజ్యం దాఖలు చేసింది.

ఆ కేసు దాఖలైన తర్వాత టిక్‌టాక్‌లో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బైట్‌డాన్స్‌ సంస్థ టిక్‌టాక్‌లో తన వాటాలను తగ్గించుకుంది.

అనంతరం ఒరాకిల్‌, సిల్వర్‌ లేక్‌, ఎమిరేట్స్‌కు చెందిన పెట్టుబడి సంస్థ ఎంజీఎక్స్‌ వంటి ప్రముఖ ఇన్వెస్టర్లతో కలిసి కొత్త టిక్‌టాక్‌ యూఎస్‌ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

వివరాలు

సోషల్‌ మీడియా సంస్థలపై పెరుగుతున్న కేసులు

పిల్లల భద్రత, గోప్యతకు సంబంధించిన అంశాలపై పలు సోషల్‌ మీడియా సంస్థలు పెద్ద సంఖ్యలో న్యాయపరమైన కేసులను ఎదుర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ అమెరికా ప్రభుత్వంతో రాజీకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

1998లో తీసుకొచ్చిన బాలల ఆన్‌లైన్‌ గోప్యతా పరిరక్షణ చట్టం (COPPA)తో పాటు వివిధ రాష్ట్రాల చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా కూడా ఎదుర్కొంటోంది.

ఈ ఆరోపణలకు సంబంధించి మెటా కోర్టు విచారణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో టిక్‌టాక్‌ సెటిల్‌మెంట్‌ చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT