Nirmala Sitharaman: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌కు చిక్కులు.. రాయితీలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఇరుదేశాల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. అవి ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. ఈపరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ఇక స్తంభించిపోయినట్లుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ఇరుదేశాలు మరిన్ని రాయితీలు పొందడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. దిల్లీలో జరిగిన ఓ బిజినెస్ లీడర్స్ సదస్సులో పాల్గొన్న ఆమె.. భారత్-అమెరికా వాణిజ్య చర్చల అంశాన్ని ప్రస్తావించారు. ట్రేడ్ డీల్ కోసం ఇంకా సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ.. ఇరుపక్షాల మధ్య పీటముడి పడినట్లుగా అనిపిస్తోంది. చర్చల పురోగతి నిలిచిపోయే స్థితికి పరిస్థితులు చేరుకున్నట్లుగా ఉన్నాయి.
వివరాలు
అమెరికాకు ఆయుధంలా టారిఫ్‌లు..
ఇక ఈ దశ దాటి.. పరస్పరం రాయితీలు ఇవ్వడం, తీసుకోవడం చాలా కష్టమైన పని. అయితే, ఇరుపక్షాలూ అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తే.. చర్చలు ముందుకెళ్లేందుకు ఆస్కారం ఉండొచ్చని భావిస్తున్నానని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
భారత్‌తో ఉన్న వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. అయితే, ఈ సమస్యను సంప్రదాయ చర్చల ద్వారా పరిష్కరించుకునే బదులు.. అమెరికా టారిఫ్‌లను ఒక ఆయుధంలా ఉపయోగిస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. భారత్-ఈయూ డీల్ విజయవంతమైన ఒప్పందమని ఆమె అన్నారు.
ఈ ఒప్పందం వల్ల భారత్‌లోని సూక్ష్మ, చిన్న మధ్యతరగతి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
వివరాలు
మార్కెట్లపై ప్రభావం..
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి.
ఆమె వ్యాఖ్యల తర్వాత సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి ఒక్కసారిగా 450 పాయింట్లకు పైగా పతనమైంది.
ఉదయం ఆరంభంలో సెన్సెక్స్ ఒక దశలో 750 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడయ్యింది. అయితే ఆ తర్వాత మార్కెట్లలో ఒడుదొడుకులు కనిపించాయి.
11.30 గంటల సమయంలో సెన్సెక్స్ 323 పాయింట్ల లాభంతో 72,232 వద్ద కొనసాగగా.. నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 22,507 వద్ద ట్రేడవుతోంది.