LOADING...
IDFC Bank: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం..  మాస్టర్‌మైండ్‌గా మాజీ మేనేజర్ 
మాస్టర్‌మైండ్‌గా మాజీ మేనేజర్

IDFC Bank: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం..  మాస్టర్‌మైండ్‌గా మాజీ మేనేజర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో చోటుచేసుకున్న రూ.590 కోట్ల మోసం వ్యవహారం బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై సాగిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణానికి నేతృత్వం వహించిన వ్యక్తి బ్యాంక్‌కు చెందిన మాజీ ఉద్యోగి అని స్పష్టమైంది. బ్యాంకింగ్ విధానాలను దుర్వినియోగం చేసి ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ఖాతాలకు మళ్లించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

నలుగురు నిందితులు అరెస్ట్ 

హర్యానా రాష్ట్రంలోని చండీగఢ్‌లో ఉన్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ శాఖలో జరిగిన ఈ మోసం కేసులో నలుగురు నిందితులను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. అరెస్టయిన వారు రిభవ్ రిషి, అభయ్ కుమార్, అభిషేక్ సింగ్లా, స్వాతి సింగ్లాగా గుర్తించారు. వీరిలో ఇద్దరు గతంలో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేసిన సిబ్బంది కాగా, మిగిలిన ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులని పోలీసులు తెలిపారు. మాజీ మేనేజర్‌గా పనిచేసిన రిభవ్ రిషి ఈ కుట్రకు సూత్రధారిగా వ్యవహరించాడని, మొత్తం ప్రణాళికను అమలు చేశాడని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతను చండీగఢ్‌లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ఉద్యోగంలో ఉన్నట్లు సమాచారం. నిందితులను మరింతగా విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

వివరాలు 

మోసం జరిగిందిలా..

హరియాణా ముఖ్యమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన-2.0 పథకానికి సంబంధించిన నిధులను జమ చేయడానికి 2025 సెప్టెంబర్ 26న సంబంధిత శాఖ అధికారులు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లలో రెండు వేర్వేరు ఖాతాలు ప్రారంభించారు. ప్రారంభంగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఖాతాలో రూ.50 కోట్లు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాలో రూ.25 కోట్లు జమ చేశారు. అయితే ఆ నిధుల వినియోగానికి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో ఆ ఖాతాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖాతాల్లో ఉన్న మొత్తం నగదును వడ్డీతో కలిపి మరో ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 13న రెండు బ్యాంకులకు అధికారిక లేఖలు పంపించారు.

Advertisement

వివరాలు 

బ్యాంక్‌లో నిర్వహణపరమైన లోపాలు

విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రభుత్వ అధికారుల సంతకాలను నకిలీగా సృష్టించి ఆ ఖాతా నుంచి భారీ మొత్తాలను షెల్ కంపెనీలకు చెందిన ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడైంది. ఈ కుట్ర వెనుక రిభవ్ రిషి ఉన్నట్లు స్పష్టమైంది. అదే సమయంలో బ్యాంక్‌లో నిర్వహణపరమైన లోపాలు కూడా ఉన్నట్లు బయటపడింది. పలు లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు గుర్తించారు.

Advertisement

వివరాలు 

ప్రభుత్వ ఖాతాల్లోని రూ.590 కోట్ల నిధులు దారి మల్లింపు 

మరింత లోతుగా పరిశీలించగా ప్రభుత్వ ఖాతాల్లోని మొత్తం రూ.590 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు తేలింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు ఇప్పటికే దారి మళ్లించిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి రికవరీ చేసినట్లు హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ వెల్లడించారు. ఈ మోసం నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాల నిర్వహణ నుంచి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్,ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లను తాత్కాలికంగా నిషేధించినట్లు తెలిపారు.

Advertisement