LOADING...
AI Summit: డిజిటల్ ఇండియా సమిట్‌లో నగదు రాజ్యం.. యూపీఐకి నో ఎంట్రీ!
డిజిటల్ ఇండియా సమిట్‌లో నగదు రాజ్యం.. యూపీఐకి నో ఎంట్రీ!

AI Summit: డిజిటల్ ఇండియా సమిట్‌లో నగదు రాజ్యం.. యూపీఐకి నో ఎంట్రీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ డిజిటల్ అభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో పాల్గొన్నవారికి తొలి రోజే ఊహించని అనుభవం ఎదురైంది. డిజిటల్ ఇండియా, ఇండియాఏఐ మిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గ్లోబల్ సదస్సులో ఆహార స్టాళ్ల వద్ద డిజిటల్ చెల్లింపులు స్వీకరించకపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యూపీఐ, కార్డులు పనిచేయక కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వారు విమర్శలు గుప్పించారు. "యూపీఐతో చెల్లించలేని కార్యక్రమం డిజిటల్ ఇండియా ఈవెంటేనా?" అని ఒకరు ప్రశ్నించగా, మరో ఎక్స్ యూజర్ దీనిని 'చెత్త అమలు విధానానికి మాస్టర్ క్లాస్' అంటూ విమర్శించాడు.

వివరాలు 

వైఫై సౌకర్యం,ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై కూడా విమర్శలు 

అతిథులకు వైఫై సౌకర్యం లేకపోవడం, ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపోవడం వంటి అంశాలను కూడా పలువురు ప్రస్తావించారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు, పరిశోధకులు పాల్గొంటుండగా, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలనలో ఏఐ వినియోగంపై చర్చలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి ప్రపంచ స్థాయి నేతలు పాల్గొంటున్న ఈ ఏఐ సదస్సులో యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులు లేకుండా కేవలం నగదే తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైఫై లేదు.. యూపీఐ లేదు.. ఏఐ సమిట్‌పై నెటిజన్ల ప్రశ్నల వర్షం

Advertisement