Loading...
Arjun Irigesi: గుకేశ్‌పై సంచలన విజయం.. క్వాంట్‌బాక్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన అర్జున్ ఇరిగేసి
గుకేశ్‌పై సంచలన విజయం.. క్వాంట్‌బాక్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన అర్జున్ ఇరిగేసి

Arjun Irigesi: గుకేశ్‌పై సంచలన విజయం.. క్వాంట్‌బాక్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన అర్జున్ ఇరిగేసి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణకు చెందిన భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి క్వాంట్‌బాక్స్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్-2026లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో సోమవారం జరిగిన ఐదో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్పై నల్లపావులతో ఆడిన అర్జున్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఈ గెలుపుతో టోర్నీ పాయింట్ల పట్టికలో సంయుక్త అగ్రస్థానానికి చేరుకుని తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. మొత్తం ఏడు రౌండ్లుగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి అర్జున్ ఇరిగేసి, ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరోజా చెరో 3.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

వివరాలు

తీవ్ర ఒత్తిడికి గురైన గుకేశ్

ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నోదిర్‌బెక్ అబ్దుసత్తరోవ్ 3 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, ఈ టోర్నీలో ఇప్పటికే రెండో ఓటమి చవిచూసిన గుకేశ్ కేవలం 1.5 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయాడు.

అర్జున్-గుకేశ్‌ల మధ్య జరిగిన పోరు ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ప్రారంభంలో గుకేశ్ తన వ్యూహాలతో ఆటపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ, సమయం తగ్గిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

కేవలం నిమిషం కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో 54వ ఎత్తులో గుకేశ్ చేసిన కీలక తప్పిదాన్ని అర్జున్ చాకచక్యంగా సద్వినియోగం చేసుకున్నాడు.

ఆ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకున్న అర్జున్, 63వ ఎత్తులో గుకేశ్ చేత ఓటమిని అంగీకరింపజేసి కీలక విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

ADVERTISEMENT