India's industrial output: జనవరిలో పరిశ్రమల వృద్ధి మందగింపు.. 4.8 శాతానికి పరిమితం
ఈ వార్తాకథనం ఏంటి
గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశ పరిశ్రమల ఉత్పత్తి జనవరిలో మందగించింది. గత డిసెంబర్‌లో 7.8 శాతం వృద్ధి నమోదు కాగా, జనవరిలో అది 4.8 శాతానికి పడిపోయింది. తయారీ రంగం 4.8 శాతం, విద్యుత్ ఉత్పత్తి 5.1 శాతం వృద్ధితో కొంత ఊరట ఇచ్చినా, గనుల ఉత్పత్తి కేవలం 4.3 శాతం మాత్రమే పెరిగింది. తయారీ రంగంలో మొత్తం 23 పరిశ్రమ గుంపుల్లో 14 గుంపులు సానుకూల వృద్ధి నమోదు చేశాయి. బేసిక్ మెటల్స్ 13.2 శాతం వృద్ధితో ముందంజలో ఉండగా,మోటార్ వాహనాలు 10.9 శాతం,ఇతర నాన్-మెటాలిక్ ఖనిజ ఉత్పత్తులు 9.9 శాతం వృద్ధి సాధించాయి. దీంతో ఉక్కు, సిమెంట్, ఆటో రంగాలు బలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
జనవరిలో పరిశ్రమల రంగం మిశ్రమ ఫలితాలు నమోదు
అయితే సబ్బులు, మందులు,కాస్మెటిక్స్ వంటి వినియోగ నాన్-డ్యూరబుల్ ఉత్పత్తులు 2.7 శాతం తగ్గుదల చూపించడం గమనార్హం. పెట్టుబడుల సూచికగా భావించే క్యాపిటల్ గూడ్స్ రంగం 4.3 శాతం మాత్రమే పెరిగి, గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 10.2 శాతం వృద్ధితో పోలిస్తే గణనీయంగా తగ్గింది. టీవీలు, ఫ్రిజ్‌ల వంటి వినియోగ డ్యూరబుల్స్ 6.3 శాతం వృద్ధి నమోదు చేసినప్పటికీ, ఇది గత ఏడాది 7.1 శాతంతో పోలిస్తే కొద్దిగా తక్కువ. మొత్తం మీద జనవరిలో పరిశ్రమల రంగం మిశ్రమ ఫలితాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
మార్చి త్రైమాసికంలో సుమారు 7.3 శాతం వృద్ధి అంచనా
ఇదిలా ఉంటే, ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ దేశ ఆర్థిక వ్యవస్థ మార్చి త్రైమాసికంలో సుమారు 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు. 2022-23ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుని విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల ప్రకారం మొత్తం ఆర్థిక సంవత్సరానికి 7.6 శాతం వృద్ధి లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ వృద్ధి కీలకంగా మారనుంది. కేంద్ర బడ్జెట్‌లో తయారీ, గనులు, ఎగుమతులు, సాంకేతిక, శ్రమ ఆధారిత రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ వృద్ధి వేగాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.