Retail Inflation : జూన్‌లో మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం.. ఆహార ధరల పెరుగుదలతో 4.38 శాతానికి చేరిక
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుతూ వస్తోందన్న అంచనాల మధ్య జూన్ నెల గణాంకాలు మళ్లీ ఆందోళన కలిగించాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో నమోదైన 3.93 శాతం నుంచి జూన్‌లో 4.38శాతానికి పెరిగింది. ఇది గత ఆరు నెలల్లో నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. దీంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)నిర్దేశించిన 4శాతం లక్ష్యాన్ని కూడా ద్రవ్యోల్బణం అధిగమించింది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం,ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆహార పదార్థాల ధరలు, రవాణా వ్యయాలు పెరగడమే. వినియోగదారుల ధరల సూచీలో ఆహార వస్తువుల వాటా అధికంగా ఉండటంతో వాటి ధరల్లో స్వల్ప పెరుగుదల కూడా మొత్తం ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.
వివరాలు
ఆహార వ్యయం కీలక భాగం
జూన్ నెలలో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ మరింత వేగంగా పెరిగింది. మేలో 4.78 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 5.32 శాతానికి చేరుకుంది.
దేశంలోని సాధారణ కుటుంబాల నెలవారీ ఖర్చుల్లో ఆహార వ్యయం కీలక భాగం కావడంతో ఈ పెరుగుదల ప్రజలపై ప్రత్యక్ష భారం మోపుతోంది.
ముఖ్యంగా హోటళ్లలో ఫుడ్ అండ్ బెవరేజెస్ ధరలు 6.94 శాతం పెరగడం గమనార్హం.
అదే సమయంలో వ్యక్తిగత వాహనాల నిర్వహణ వ్యయం 7.35 శాతం పెరిగింది. సరుకు రవాణా సేవల ఖర్చులు కూడా 7.70 శాతం పెరగడంతో వివిధ వస్తువుల ధరలపై అదనపు ఒత్తిడి ఏర్పడింది.
అయితే అన్ని విభాగాల్లో ధరలు పెరగలేదు. కొన్ని వస్తువుల ధరల్లో తగ్గుదల కూడా నమోదైంది.
వివరాలు
వాహనాల కొనుగోలు విభాగంలో ద్రవ్యోల్బణం మైనస్ 4.59 శాతం
వాహనాల కొనుగోలు విభాగంలో ద్రవ్యోల్బణం మైనస్ 4.59 శాతంగా నమోదవడం వల్ల ఆ విభాగంలో ధరలు తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
అలాగే కొన్ని వినోద ఉత్పత్తులు, గృహోపకరణాల ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది.
ఇక వ్యక్తిగత విలువైన వస్తువుల విభాగంలో మాత్రం ధరల పెరుగుదల కొనసాగుతోంది.
ముఖ్యంగా నగల ధరలు భారీగా పెరగడంతో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 50.17 శాతంగా నమోదైంది.
బంగారం,ఇతర విలువైన ఆభరణాల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4.74 శాతానికి చేరుకోగా, పట్టణ ప్రాంతాల్లో అది 3.92 శాతంగా నమోదైంది.
వివరాలు
గత ఐదు నెలలుగా తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం
అంటే ఆహార పదార్థాల ధరల పెరుగుదల ప్రభావం గ్రామీణ ప్రజలపై మరింత తీవ్రంగా పడుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గత ఐదు నెలలుగా తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం జూన్‌లో మళ్లీ పెరగడం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ఆహార ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణ నియంత్రణ కేంద్ర ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు కూడా కీలక సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.