
Piyush Goyal: క్రిప్టోపై కేంద్రం కీలక ప్రకటన.. ఆర్‌బీఐ గ్యారెంటీతో త్వరలో డిజిటల్ కరెన్సీ!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లేదా దేశీయ కరెన్సీ వంటి ఏ విధమైన భౌతిక లేదా ఆర్థిక మద్దతు లేని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను ప్రభుత్వం ప్రోత్సహించదని తెలిపారు. వీటికి ప్రత్యామ్నాయంగా, RBI గ్యారెంటీ కలిగిన అధికారిక డిజిటల్ కరెన్సీని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
వివరాలు
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను ప్రోత్సహించేది లేదని కేంద్రం స్పష్టీకరణ
దోహాలో పర్యటిస్తున్న సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.."సార్వభౌమత లేదా ఆస్తిపరమైన మద్దతు లేని క్రిప్టోకరెన్సీలకు మేము అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేయడం అవసరం.ఇది ప్రజలను ఆర్థిక నష్టాల నుంచి రక్షించడానికి తీసుకుంటున్న ఒక జాగ్రత్త చర్య. అందుకే, వీటిపై పూర్తి నిషేధం విధించకపోయినా, వాటి వినియోగాన్ని తగ్గించడానికి ఎక్కువ పన్నులు విధిస్తున్నాం" అని వివరించారు.
వివరాలు
RBI-ఆధారిత డిజిటల్ కరెన్సీ ప్రయోజనాలు
గోయల్ వివరించినట్లు, RBI హామీతో రూపొందనున్న డిజిటల్ కరెన్సీ దేశంలో లావాదేవీలను మరింత సులభం చేస్తుంది. ఈ కొత్త పద్ధతిలో కాగితం వాడకం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థతో పోలిస్తే, లావాదేవీలు వేగంగా, పారదర్శకంగా జరగనున్నాయి. ముఖ్యంగా ప్రతి లావాదేవీ గుర్తింపు సాధనంతో జరిగే అవకాశం కలిగిస్తుంది.
వివరాలు
భారత్-ఖతార్ వాణిజ్య సంబంధాలు
ఈ పర్యటనలో భాగంగా,భారత్,ఖతార్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం,పెట్టుబడులను పెంచే దిశగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) పై చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సమావేశమై, చర్చలను వేగవంతం చేయడానికి ఒప్పుకున్నారు. గోయల్ అంచనా ప్రకారం, వచ్చే ఏడాది మధ్య లేదా మూడవ త్రైమాసికం లోపు ఈ ఒప్పందాన్ని అంగీకరించవచ్చునని భావిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఖతార్ మధ్య వాణిజ్యం 14.15 బిలియన్ డాలర్ల స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. ఇదే తరహాలో, భారత్ ఇప్పటికే యూఏఈతో వాణిజ్య ఒప్పందం కుదర్చినట్లు, త్వరలో ఒమన్‌తో కూడా ఇలాంటి ఒప్పందం జరగనున్నదని ఆయన తెలిపారు.