IMF: ప్రపంచ అనిశ్చితుల్లోనూ దృఢంగా భారత్ : ఐఎంఎఫ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొని,వృద్ధిరేటు మందగిస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా వెల్లడించారు. బలమైన పునాదులు, సమర్థవంతమైన విధానాల వల్ల ఇతర దేశాల కంటే భారత్ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి వసంత సమావేశాల సందర్భంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ సగటు వృద్ధిరేటుతో పోలిస్తే భారత్ రెండు రెట్లు ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తోందని జార్జివా స్పష్టం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా అమలు చేసిన విధాన సంస్కరణలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం వల్లే ఈ స్థిరత్వం సాధ్యమైందని తెలిపారు.
వివరాలు
ద్రవ్యోల్బణ నియంత్రణలో ఇంకా సంస్కరణలు అవసరం
బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు బాహ్య ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటాయని పేర్కొన్నారు. భారత్‌తో పాటు అనేక వర్ధమాన దేశాలు తమ విధానాల్లో, ముఖ్యంగా ద్రవ్య విధానంలో గణనీయమైన మెరుగుదల సాధించాయని ఆమె అన్నారు. ఈ విషయంలో వర్ధమాన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలకు సమానంగా లేదా మరింత మెరుగ్గా ఉన్నాయని కితాబునిచ్చారు. అయితే ద్రవ్యోల్బణ నియంత్రణలో ఇంకా సంస్కరణలు అవసరమని అంగీకరించారు. ఈ దేశాల ఆర్థిక స్థిరత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచిందని వివరించారు. అయితే పశ్చిమాసియాలో జరుగుతున్న సంఘర్షణలు దీర్ఘకాలం కొనసాగితే భారత్‌తో పాటు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
గల్ఫ్ ప్రాంతంపై ఆధారపడే ఆసియా దేశాలు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం
పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ వృద్ధిరేటు రెండు శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలు, గల్ఫ్ ప్రాంతంపై ఆధారపడే ఆసియా దేశాలు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, పటిష్ఠమైన సంస్థాగత వ్యవస్థ, విశ్వసనీయ విధానాలున్న భారత్ వంటి దేశాలు ఇతర దేశాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు పెద్ద ప్రమాద సూచనలు కనిపించడంలేదని, అయితే ఆర్థిక స్థిరత్వాన్ని నిరంతరం పర్యవేక్షించడం అవసరమని సూచించారు.