Indian Passport: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 75వ స్థానానికి చేరిన భారత పాస్‌పోర్ట్..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత బలమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ఈసారి గణనీయమైన పురోగతి సాధించింది. తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ ప్రకారం,భారత పాస్‌పోర్ట్ 75వ స్థానానికి చేరుకుంది. గత సంవత్సరం 85వ స్థానంలో ఉన్న భారత్,ఈసారి పది స్థానాలు ముందుకు దూసుకెళ్లడం విశేషంగా నిలిచింది. ఈ తాజా ర్యాంకు ప్రకారం, భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు ముందస్తు వీసా అవసరం లేకుండా మొత్తం 56 దేశాలకు ప్రయాణించే అవకాశం పొందుతున్నారు. ఇది అంతర్జాతీయంగా భారతీయులకు ప్రయాణ స్వేచ్ఛ క్రమంగా పెరుగుతోందనడానికి స్పష్టమైన సంకేతంగా చెప్పవచ్చు. అయితే, ప్రస్తుత ర్యాంకు మెరుగైనదైనప్పటికీ, ఇది భారత్ సాధించిన అత్యుత్తమ స్థానం మాత్రం కాదు. గతంలో,2006లో భారత్ 71వ స్థానాన్ని దక్కించుకుని అత్యుత్తమ ప్రదర్శన చూపించింది.
వివరాలు
జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సింగపూర్ పాస్‌పోర్ట్
అనంతరం 2024లో 80వ స్థానానికి పడిపోగా, ఆ తర్వాత 85వ స్థానానికి చేరింది. ఇప్పుడు మళ్లీ ర్యాంకులో గణనీయంగా పుంజుకోవడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా మరోసారి సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పౌరులు ఏకంగా 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించగలరు. జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించగా,వీటి పాస్‌పోర్ట్‌లతో 187 దేశాలకు ప్రవేశం లభిస్తుంది. స్వీడన్,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మూడో స్థానంలో ఉండగా,వీటికి 186 దేశాలకు వీసా రహిత ప్రయాణ సౌలభ్యం ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ,స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు కలిసి నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. అలాగే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాలు టాప్ 10 జాబితాలో చోటు సంపాదించాయి.